స్టేషన్‌కు వెళ్తే పంచాయితీలో తేల్చుకోవాలన్న పోలీసులు
న్యాయం చేయాలంటూ గుండు గీయించుకొని బాధితురాలి నిరసన
మహబూబాబాద్‌లో ఘటన
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తల్లికి తెలియకుండానే కొడుకు రూ.12 లక్షల లోన్ తీసుకున్నాడు. తీరా ఆ విషయం తెలిసి తల్లి అడిగేసరికి ఇస్తానని చెప్పి పరారయ్యాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్‌లో జరిగింది. పట్టణంలోని సిగ్నల్ కాలనీకి చెందిన కడారి సరోజిని రాణి ప్రభుత్వ ఆఫీసులో అటెండర్‌గా పని చేస్తోంది. షుగర్ వల్ల ఆమెకు కండ్లు సరిగా కనబడడం లేదు. ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడడంతో కాలు విరిగింది. దీంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటోంది. అయితే ఆమె జీతం డబ్బులను బ్యాంకుకు వెళ్లి పెద్ద కొడుకు రామకృష్ణ తెచ్చేవాడు.
ఈ క్రమంలో ఆమె అకౌంట్ ను ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మార్చాడు. తల్లి పేరిట రూ.12.40 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నాడు. తన తల్లి బ్యాంకుకు రాలేని పరిస్థితుల్లో ఉందని అధికారులను నమ్మించి, ఆ డబ్బులను తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో పెద్ద మనుషుల వద్దకు వెళ్లగా.. రెండుమూడు రోజుల్లో డబ్బులిస్తానని రామకృష్ణ చెప్పాడు. కానీ డబ్బు ఇవ్వకుండా తన కొడుకు పరారయ్యాడని, ఫోన్ చేస్తే ఉల్టా బెదిరిస్తున్నాడని సరోజిని రాణి వాపోయింది. దీనిపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ, పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకోవాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, మోసం చేసిన కొడుకును శిక్షించాలని అంబేద్కర్ విగ్రహం ముందు గుండు గీయించుకొని నిరసనకు దిగింది
