- భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో విషాదం
రేగొండ, వెలుగు : తండ్రికి మూడో రోజు కర్మ చేసేందుకు సిద్ధమవుతుండగా విద్యుత్ షాక్‌తో కొడుకు చనిపోయాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కనుకుంట్ల సమ్మయ్య అనారోగ్యంతో మూడు రోజుల కింద చనిపోయాడు.
గురువారం మూడోరోజు కర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా సమ్మయ్య కొడుకు గోపి (46) మోటార్ ఆన్ చేసి ఇంటి ముందున్న సంప్‌లో నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ కొట్టింది. గమనించిన గోపి అక్క తమ్ముడిని రక్షించే ప్రయత్నం చేయగా.. ఆమెకు కూడా గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ గోపిని కుటుంబ సభ్యులు పరకాల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. మృతుడికి భార్య సంధ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సంధ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
