రాహుల్​కు పిల్లని సూడున్రి.. పెండ్లి చేద్దాం

రాహుల్​కు పిల్లని సూడున్రి.. పెండ్లి చేద్దాం
  • పెండ్లి చేద్దామా’ అని అడిగిన పెద్దావిడకు సోనియా సమాధానం
  • అవుతుంది.. అవుతుంది అంటూరాహుల్​ చిరునవ్వులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎక్కడికెళ్లినా ఓ ప్రశ్న కామన్. తరచూ ఎదురయ్యే ఆ ప్రశ్నకు ఆయన ఓ నవ్వు నవ్వేసి వదిలేయడమూ కామనే. ఎంతమంది ఎన్ని సార్లు అడిగినా ఇదే తీరు. దీంతో ఏకంగా ఆయన తల్లి సోనియా గాంధీనే అడిగేసింది ఓ పెద్దావిడ. ‘‘రాహుల్‌కు పెండ్లి చేద్దామా?’’ అని మెల్లగా అడిగింది. సోనియాగాంధీ క్షణం కూడా లేట్ చేయకుండా.. ‘‘మీరే ఓ పిల్లని చూడండి’’ అని బదులిచ్చారు. అక్కడే ఉన్న రాహుల్.. ‘‘అవుతుంది.. అవుతుంది’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ఢిల్లీ టెన్‌ జన్‌పథ్​లోని సోనియాగాంధీ ఇల్లు ఇందుకు వేదికైంది. శనివారం ఈ మేరకు ఓ వీడియోను రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. 

ప్రత్యేక అతిథులతో అమ్మకు, ప్రియాంకకు, నాకు గుర్తుండిపోయే రోజు ఇది. సోనిపట్ రైతు సోదరీమణుల ఢిల్లీ దర్శన్, ఇంట్లో వారితో భోజనం, ఇంకా ఎన్నో మాటలతో గడిచింది. దేశీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు సహా ఎన్నో అమూల్యమైన బహుమతులు, మరెంతో ప్రేమ లభించాయి” అని రాహుల్ పేర్కొన్నారు. ఈ వీడియోలో మహిళలతో సోనియా, ప్రియాంక ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. వారితో డ్యాన్స్‌‌ కూడా చేశారు. ‘‘భోజనం నచ్చిందా? అందరికీ స్వీట్లు అందాయా?” అంటూ రాహుల్ అడగడం కనిపించింది. అలాగే, చిన్నారులకు చాక్లెట్లను రాహుల్ పంచారు.

ఇచ్చిన మాట ప్రకారం ‘ఢిల్లీ దర్శన్‌‌

రాహుల్ గాంధీ ఈ నెల 8న హర్యానాలోని సోని పట్ జిల్లా మదీనా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడారు. వరి చేలల్లోకి దిగి నాట్లు వేశారు. పొలంలో ట్రాక్టర్ నడిపారు. అనంతరం వారితో కలిసి అన్నం తిన్నారు. తాము ఢిల్లీకి దగ్గర్లోనే ఉన్నా అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని ఈ సందర్భంగా కొందరు మహిళలు చెప్పారు. దీంతో ‘ఢిల్లీ దర్శన్‌‌’ పేరుతో టూర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తానని, రావాలని వారిని  రాహుల్ ఆహ్వానించారు. ఆ సమయంలో తన సోదరి ప్రియాంకా గాంధీతో ఫోన్‌‌లో మాట్లాడించారు. భోజనానికి వస్తామని ఈ సందర్భంగా
ప్రియాంకతో వారు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారు సోనియా ఇంటికి వచ్చారు. వారికి సోనియా గాంధీ లంచ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు ఢిల్లీలోని పలు ప్రాంతాలను వాళ్లు చూసొచ్చారు.