కాంగ్రెస్ చీఫ్ మళ్లీ సోనియానే..!

కాంగ్రెస్ చీఫ్ మళ్లీ సోనియానే..!

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. సమావేశం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  ప్రకటన విడుదల చేసింది.  "ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మా వ్యూహం లోపించడం వల్లే నాలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల దుష్పరిపాలనను సమర్థవంతంగా బయటపెట్టలేకపోయాం. పంజాబ్ లో నాయకత్వ మార్పు తర్వాత తక్కువ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను అదుపు చేయలేకపోయాం.  దేశంలో కొనసాగుతున్న రాజకీయ నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా కోట్లాది మంది భారతీయుల ఆశలకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీ  అభ్యర్థుల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తరుపున కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రజాభిప్రాయాన్ని వినమ్రతతో అంగీకరిస్తూ, అప్రమత్తమైన  శక్తివంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలకు దేశ ప్రజలకు హామీ ఇస్తుంది. భవిష్యత్‌లో 2022, 2023 ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ  సన్నద్ధతతో ఉంది. సోనియా గాంధీ నాయకత్వంపై  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మాణం. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం. పార్టీ బలోపేతం, రోడ్ మ్యాప్ పై కాంగ్రెస్ పార్టీ సమగ్ర ఆలోచనా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యుూసీ నిర్ణయం.

కాంగ్రెస్ చీఫ్ మళ్లీ సోనియానే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగుతారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గాంధీ ఫ్యామిలీ పార్టీ పదవుల నుంచి రాజీనామా చేస్తారనే వార్తల్లో నిజం లేదన్నారు. ప్రతిపక్ష హోదాను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలపైనే ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షత జరిగిన  భేటీకి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఐదు రాష్ట్రాల పార్టీ ఇంచార్జులు, పీసీసీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు.