నవీ ముంబై: భారీ టార్గెట్ ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ చివర్లో విజయాన్ని జారవిడిచింది. గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 7 రన్స్ అవసరం కాగా, సోఫీ డివైన్ (2/21) దెబ్బకు లారా వోల్‌వర్ట్ (77), జెమీమా రోడ్రిగ్స్ (15) ఔట్ కావడంతో డీసీ 4 రన్స్ స్వల్ప తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 209 రన్స్‌కు ఆలౌటైంది. సోఫీ డివైన్ (42 బాల్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95) దంచికొట్టగా, ఆష్లే గార్డెనర్ (26 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) అండగా నిలిచింది.
స్టార్టింగ్‌లో ఫెయిలైన డీసీ బౌలర్లు చివర్లో పట్టు బిగించారు. నందిని శర్మ (5/33), చినెల్లీ హెన్రీ (2/43), శ్రీచరణి (2/42) వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దాంతో బెత్ మూనీ (19), జార్జియా వారెహామ్ (3), అనుష్క శర్మ (13), భారతి ఫుల్మాలి (3), కశ్వీ గౌతమ్ (14), కనికా అహుజా (4), రాజేశ్వరి గైక్వాడ్ (0), రేణుకా సింగ్ (0), తనుజా కన్వర్ (1 నాటౌట్) నిరాశపర్చారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. ఓపెనర్ లీజెల్లి లీ (86), షెఫాలీ వర్మ (14)తో తొలి వికెట్‌కు 41, లారాతో రెండో వికెట్‌కు 90 రన్స్ జోడించింది. తర్వాత లారా, జెమీమాతో నాలుగో వికెట్‌కు 58 రన్స్ జత చేసి విజయం దిశగా తీసుకెళ్లింది. అయితే చివరి ఓవర్‌లో ఒక్క రన్ తేడాతో వీళ్లిద్దరూ ఔట్‌కావడంతో డీసీ గెలుపు ముందు బోల్తా కొట్టింది. చినెల్లీ హెన్రీ (7), మారిజానె కాప్ (1 నాటౌట్) నిరాశపర్చారు. డివైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల లభించింది.
