- కాన్పూర్‌లో విషాద సంఘటన
కాన్పూర్ (యూపీ): ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, యూపీ రాష్ట్రంలోనే థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్న ఆనంద్(23) కాన్పూర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. 2024లో బీటెక్ పూర్తి చేసిన ఆనంద్.. పవర్ గ్రిడ్‌లో అప్రెంటిస్‌షిప్ ముగించుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాడు.
రైల్వేస్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన పలు రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యాడు. అయితే, కుటుంబ సభ్యులు బిహార్ వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆనంద్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించింది. "సారీ నాన్నా, నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి సుమారు 50 సార్లు ప్రయత్నించాను, కానీ సఫలం కాలేకపోయాను. నన్ను క్షమించండి" అని లేఖలో అతడు పేర్కొన్నాడు.
గత కొన్ని నెలలుగా ఆనంద్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని అతని తండ్రి రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
