లంకను ముంచారు!

లంకను  ముంచారు!

సెమీస్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్న శ్రీలంకకు.. సౌతాఫ్రికా పోతుపోతూ పెద్ద షాకే ఇచ్చింది. అప్పట్లో వరుణుడు కొట్టిన దెబ్బ నుంచి కోలుకుంటున్న లంకేయుల పరిస్థితిని ఒక్క మ్యాచ్‌‌తో తలకిందులు చేసింది. దీంతో మిగతా రెండు మ్యాచ్‌‌ల్లో లంక కచ్చితంగా గెలిచి తీరాలి. అదే టైమ్​లో ఇతర జట్ల సమీకరణాలు కూడా అనుకూలించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇది జరగడం దాదాపు అసాధ్యమే అయినా.. సాంకేతికంగా లంక ఇంకా రేసులో ఉన్నట్లే. అంతా అయిపోయిన తర్వాత ఆల్‌‌రౌండ్‌‌ షో చూపెట్టిన ప్రొటీస్‌‌ రెండో విక్టరీతో ఉపశమనం పొందింది.

వరల్డ్‌‌కప్‌‌లో లంకకు షాకింగ్‌‌ ఓటమి. బ్యాటింగ్‌‌లో తడబడటంతో పాటు బౌలింగ్‌‌లోనూ విఫలమై.. తక్కువ స్కోరును కాపాడుకోలేక కీలక మ్యాచ్‌‌ను అప్పనంగా సౌతాఫ్రికాకు అప్పగించింది. దీంతో శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 9 వికెట్ల తేడాతో గెలిచిన ప్రొటీస్‌‌.. లంక సెమీస్‌‌ అవకాశాలను క్లిష్టం చేసింది. టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌‌ పెరీరా (34 బంతుల్లో 4 ఫోర్లతో 30), అవిష్క ఫెర్నాండో (29 బంతుల్లో 4 ఫోర్లతో 30) టాప్‌‌ స్కోరర్లు. ప్రొటీస్‌‌ బౌలర్లలో ప్రిటోరియస్‌‌ (3/25), క్రిస్‌‌ మోరిస్‌‌ (3/46) మూడేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌ (103 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌‌తో 96 నాటౌట్‌‌), హషీమ్‌‌ ఆమ్లా(105 బంతుల్లో 5 ఫోర్లతో 80 నాటౌట్‌‌) అజేయ ఇన్నింగ్స్‌‌తో చెలరేగడంతో 37.2 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 206 రన్స్‌‌ చేసి గెలిచింది. ప్రిటోరియస్‌‌ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.

ఆమ్లా–డుప్లెసిస్‌‌ 175*

ముందు బ్యాట్స్‌‌మన్‌‌ ఫ్లాప్‌‌ షో చేస్తే, ఆ తర్వాత లంక బౌలర్లు అట్టర్‌‌ ఫ్లాప్‌‌ షో చేశారు. పసలేని బౌలింగ్‌‌లో స్వేచ్ఛగా ఆడిన డుప్లెసిస్‌‌, ఆమ్లా రెండో వికెట్‌‌కు అజేయంగా 175 రన్స్‌‌ జోడించి జట్టుకు విజయం అందించారు. ఇన్నింగ్స్‌‌ ప్రారంభం నుంచి  ఆమ్లా జాగ్రత్తగా ఆడగా,  హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో 6, 4 కొట్టిన డుప్లెసిస్‌‌ ఒక్కసారిగా దూకుడు పెంచాడు.  దీంతో 36.2 ఓవర్లకు ప్రొటీస్‌‌200 మార్కు దాటింది. సెంచరీ చేసేలా కనిపించిన డుప్లెసిస్‌‌..  తిశారా వేసిన 38వ ఓవర్‌‌ రెండో బంతిని బౌండరీకి తరలించి విజయ లాంఛనం పూర్తి చేశాడు. అయితే సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అంతకముందు ఓపెనర్‌‌ క్వింటన్‌‌ డికాక్‌‌(15) మరోసారి నిరాశపరిచాడు. .

బ్యాటింగ్‌‌లో నిర్లక్ష్యం..

బ్యాట్స్‌‌మెన్‌‌ నిర్లక్ష్యం లంక కొంపముంచింది. అతికష్టం మీద 200 మార్కు దాటింది. ప్రిటోరియస్‌‌, మోరిస్‌‌ దెబ్బకు నిలువెల్లా వణికిన లంక టాప్‌‌, మిడిలార్డర్‌‌.. కనీసం పూర్తి ఓవర్ల కోటాను కూడా ఆడలేకపోయింది. లంకేయులంతా దాదాపు చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్‌‌ తొలి బంతికే లంకకు భారీ షాక్‌‌ తగిలింది. రబాడ వేసిన మ్యాచ్‌‌ తొలి బంతికి లంక కెప్టెన్‌‌ దిముత్‌‌ కరుణరత్నె డకౌటయ్యాడు. కరుణరత్నె ఇచ్చిన క్యాచ్‌‌ను ఫస్ట్‌‌ స్లిప్‌‌లో డుప్లెసిస్‌‌ అందుకున్నాడు. అయితే మరో ఓపెనర్‌‌ పెరీరా, ఫెర్నాండోతో కలిసి రెండో వికెట్‌‌కు 58 బంతుల్లో 67 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్‌‌ పదో ఓవర్లో అవిష్కను 12వ ఓవర్‌‌లో కుశాల్‌‌ను పెవిలియన్‌‌ చేర్చాడు. ఆ తర్వాత 29 బంతులు ఆడి 11 రన్స్‌‌ చేసిన మాథ్యూస్‌‌ (11)ను మోరిస్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. కుశాల్‌‌ మెండిస్‌‌(23)ను 28వ ఓవర్‌‌లో ప్రిటోరియస్‌‌ బలిగొన్నాడు. ఆ తర్వాత వచ్చిన ధనుంజయ డిసిల్వా(24),  జీవన్‌‌ మెండిస్‌‌(18), తిశారా పెరీరా(21) ఇబ్బందులుపడుతూ రెండంకెల స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్‌‌ నత్తనడకన సాగడంతో 49.2 ఓవర్లుకు కానీ లంక 200 మార్కును దాటలేకపోయింది. ఆ తర్వాత బంతికే మలింగ(4)ను ఔట్‌‌ చేసిన మోరిస్‌‌ లంక ఇన్నింగ్స్‌‌కు ముగింపు పలికాడు.

శ్రీలంక : కరుణరత్నె (సి) డుప్లెసిస్‌‌ (బి) రబాడ 0, కుశాల పెరీరా(బి) ప్రిటోరియస్‌‌ 30, అవిష్క ఫెర్నాండో (సి) డుప్లెసిస్‌‌ (బి) ప్రిటోరియస్​ 30, కుశాల్‌‌ మెండిస్‌‌ (సి) మోరిస్‌‌ (బి) ప్రిటోరియస్‌‌ 23, మాథ్యూస్‌‌ (బి) మోరిస్‌‌ 11, ధనుంజయ డిసిల్వా (బి) డుమిని 24, జీవన్‌‌ మెండిస్‌‌ (సి) ప్రిటోరియస్‌‌ (బి) మోరిస్‌‌ 18, తిశార పెరీరా (సి) రబాడ (బి) పెహ్లుక్వాయో 21, ఉదాన (సి) అండ్‌‌ (బి) రబాడ 17, లక్మల్‌‌ (నాటౌట్‌‌)5, మలింగ (సి) డుప్లెసిస్‌‌ (బి) మోరిస్‌‌ 4 ; ఎక్స్‌‌ట్రాలు: 20 : మొత్తం : 49.3 ఓవర్లలో 203 ఆలౌట్‌‌ ; వికెట్ల పతనం : 1–0, 2–67, 3–72, 4–100, 5–111, 6–135, 7–163, 8–184, 9–197, 10–203 ; బౌలింగ్‌‌ : రబాడ 10–2–36–2, మోరిస్‌‌ 9.3 –0–46–3, ప్రిటోరియస్‌‌ 10–2–25–3, పెహ్లుక్వాయో 8–0– 38–1, తాహిర్‌‌ 10–0–36–0, డుమిని 2–0–15–1.

సౌతాఫ్రికా : డికాక్‌‌ (బి) మలింగ 15, ఆమ్లా (నాటౌట్‌‌) 80, డుప్లెసిస్‌‌ (నాటౌట్‌‌) 96; ఎక్స్‌‌ట్రాలు: 15 ; మొత్తం: 37.2 ఓవర్లలో 206/1 ; వికెట్ల పతనం:1– 31; బౌలింగ్‌‌ : మలింగ 10–1–47–1, ధనుంజయ 4–0–18–0, లక్మల్‌‌ 6–0–47–0,తిశార పెరీరా 5.2–1–28–0, జీవన్‌‌ మెండిస్‌‌ 7–0–36–0, ఉదాన 5–0–29–0.

 

సీన్‌‌ రిపీట్‌‌..

శ్రీలంక ఇన్నింగ్స్‌‌48వ ఓవర్‌‌లో  మైదానంలోకి తేనేటీగల గుంపు రావడంతో మ్యాచ్‌‌ కాసేపు ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు మైదానంలో పడుకుని తేనేటీగల దాడి నుంచి తమని తాము రక్షించుకున్నారు. 2017లో జొహన్నెస్‌‌బర్గ్‌‌లో శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఓ మ్యాచ్‌‌లోను ఇలానే తేనేటీగల దాడి జరిగింది. అప్పుడు కూడా లంకే బ్యాటింగ్‌‌ చేస్తుండడం విశేషం.