అనగనగా ఒక ఊరు..అడవిపూల వనం..

అనగనగా ఒక ఊరు..అడవిపూల వనం..

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా... వసంత రుతువు రాగానే పండుగ రోజుల్లా ఉంటుంది ఆ ఊళ్లో. ఆ ఊరి పొలిమేర మొదలుకొని శివార్ల వరకు ఎటు చూసినా పూల మొక్కలతో కళకళలాడుతుంటుంది. అయితే అవి గులాబీలు, మల్లెలు, చామంతులు కాదు. అచ్చమైన అడవి పూలు. ఇంటింటా రంగురంగుల పూలు పలకరిస్తాయి. అలాగని ఇక్కడ నీళ్లు పుష్కలంగా దొరకవు. సూర్యుడు భగభగమండే ఆఫ్రికా దేశం. మరయితే అందమైన పూల పంట ఎలా సాధ్యమైంది? ఆ చిత్రాలను చూడాలంటే.. దక్షిణాఫ్రికాలోని నివడ్లో వెళ్లాల్సిందే.

దక్షిణాఫ్రికాలోని ఒక పాపులర్ విలేజ్ నివడ్లో. ఇది నార్తర్న్​ కేప్​ ప్రావిన్స్​లోని నమక్వా మున్సిపాలిటీలో ఉంది. 1897వ సంవత్సరంలో ఊరుగా ఏర్పడింది ఇది. ఈ ఊరు దక్షిణాఫ్రికాలోని టూరిస్ట్​ డెస్టినేషన్స్​లో బాగా పాపులర్​​. ఇక్కడ రంగురంగుల అడవి పూలు పలకరిస్తాయి. పూలు పూచే సీజన్​లో మాత్రం ఆ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉంటుంది. దాన్ని కరూ మైదానం అంటారు. పూల అందాలు చూస్తుంటే ఎవర్ని వాళ్లు మైమరిచిపోవాల్సిందే. అందుకే కాబోలు దీన్ని ‘బల్బ్ క్యాపిటల్ ఆఫ్​ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు.  వసంత రుతువు​లో బల్బ్​ పూల మొక్కలు పూతపూసే సమయం. ఆ సీజన్​లో ఊరంతా పూలవనమే. ఇన్ని బల్బ్​ పూలు ఉన్నాయి కానీ అక్కడ బల్బ్ పూల​ నర్సరీ ఒక్కటి కూడా కనిపించదు. ఈ పూల మొక్కలను పెంచుకోవాలనుకుంటే ఇంటి పెరడులో బల్బ్​ నాటాల్సిందే. ఈ పూల మొక్కల జాతులు దాదాపు1350కి పైగా ఉంటే, వాటిలో దాదాపు 600కి పైగా జాతులు ఈ ఊళ్లోనే ఉన్నాయి. వీటిలో 40 జాతులు మాత్రం అంతరించేదశలో ఉన్నాయట. 

పూల సీజన్​లో వెళ్లి బల్బ్​ ఫ్లవర్స్​ చూసి రావడమే కాకుండా.. ఇంకా ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి. ఊరికి అవతల ఉన్న వాటర్ ఫాల్, క్వివర్ ట్రీ ఫారెస్ట్​, లోకల్ ఇసుకరాతి శిథిలాలు, హిమానీ నదాల్లో నడక దారులు, ఊర్లోగ్​షఫ్​​ నేచర్ రిజర్వ్, హాంటమ్​ నేషనల్ బొటానికల్ గార్డెన్లో అలా అలా తిరిగి చూడొచ్చు. ఇవే కాకుండా అక్కడ రకరకాల పక్షులు కూడా కనిపిస్తాయి. హైకింగ్​ చేయడాన్ని ఇష్టపడేవాళ్లకి బెస్ట్​ ప్లేస్​.   

వైల్డ్ ఫ్లవర్ రిజర్వ్

ఈ రిజర్వ్​ సిటీకి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. లోకల్​గా కనిపించే 300 జాతులకు పైగా పూలు కనిపిస్తాయి ఇక్కడ. దానికి దగ్గర్లోనే జలపాతం ఉంటుంది. ఈ జలపాతం డోర్న్ నది నుంచి వస్తుంది. వర్షాకాలం మొదలైనప్పుడు ఇక్కడికి వెళ్లి చూడడం చాలా బాగుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే  ఆ ప్రదేశమంతా పచ్చని పచ్చికతో పిక్నిక్​ ప్లేస్​లా ఉంటుంది. ఆ పచ్చిక మీద ఓపిక ఉన్నంతసేపు వాకింగ్​ చేయొచ్చు. ప్రతిరోజూ బిజీబిజీగా, పెద్ద పెద్ద శబ్దాల మధ్య హడావిడి జీవితాలు సాగదీస్తూ విసిగిపోయిన వాళ్లకు ఇది బెస్ట్​ ప్లేస్​. రంగురంగుల అడవి పూలు విరబూసే సీజన్​లో ఇక్కడక వెళ్తే మనసుకి ఉల్లాసంతో తేలిపోవడం ఖాయం.

ఊర్లోగ్​షఫ్​​ నేచర్ రిజర్వ్ 

ఈ రిజర్వ్ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ హైకింగ్ చేయొచ్చు. ఇక్కడ హైకింగ్​ చేస్తుంటే ప్రకృతి పచ్చదనంతో హాయిగా వెల్​కం చెప్తున్నట్టు ఉంటుంది. లోయలు, గుహలు, వాగుల వరకు ఎన్నో చూడొచ్చు. నాలుగు లేదా ఐదు రోజులు హైకింగ్​ చేయొచ్చు. అంత టైం లేదనుకుంటే నార్మల్ హైకింగ్​కి కూడా వెళ్లొచ్చు. 

క్వివర్ ఫారెస్ట్

ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో క్వివర్ ఫారెస్ట్ ఉంది. దక్షిణాఫ్రికాలో ఉన్న ఈ క్వివర్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్ని చూసేందుకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 
6 గంటల వరకు పర్మిషన్​ ఉంటుంది. రాత్రుళ్లు వెళ్లాలనుకున్నా, ఫొటోలు తీయాలన్నా 250 రూపాయలు కట్టాలి.