సేవల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

సేవల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

సికింద్రాబాద్, వెలుగు: వేసవిలో ప్యాసింజర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మర్​స్పెషల్​ రైళ్లను రైల్వే శాఖ  అందుబాటులోకి తెచ్చింది.  వివిధ మార్గాల్లో 1,079 అదనపు రైళ్లను నడుపుతున్నది. వాటితో  రికార్డు స్థాయిలో 9,111 ట్రిప్పులను నిర్వహిస్తున్నది. గతేడాది(6,369 ట్రిప్పులు)తో పోలిస్తే ..2,742 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

 ప్రధాన మార్గాల్లో అవాంతరాలు లేని ప్రయాణాన్ని సాగించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ప్రదేశాలకు ఈజీగా చేరుకునేందుకు ఈ చర్య ఉపయోగపడుతున్నదని తెలిపారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి సమ్మర్​స్పెషల్​రైళ్లను అదనపు ట్రిప్పులను నడపుతున్నామని పేర్కొన్నారు. 

ఈ  రైళ్లు పూర్తిగా రిజర్వ్ చేయని కోచ్ లను కలిగి ఉంటాయన్నారు. తద్వారా వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ప్లాన్ చేసే దిగువ, మధ్యతరగతి, కార్మికుల రైలు ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉంటాయని తెలిపారు. సమ్మర్​స్పెషల్​ట్రైన్స్ టికెట్లను రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ఐఆర్సీటీసీ యాప్ లో లభ్యమవుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.