
హైదరాబాద్ పాతబస్తీలో భారీగా గంజాయిని పట్టుకున్నారు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి నాసిక్ తరలిస్తుండగా బండ్లగూడలో పట్టుకున్నారు. రూ. 2.70 కోట్ల విలువైన 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు నుంచి ఆంధ్రా, తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బండ్లగూడ పోలీసులుతో కలిసి బండ్లగూడ ఓ ఎస్ ఫంక్షన్ హాల్ దగ్గర పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్ లో ప్రయాణిస్తున్న మొహమ్మద్ ఖలీం ఉద్దీన్, షేక్ సోహైల్, మొహమ్మద్ ఆఫ్జల్ లను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించగా 900 కిలోల గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ ఆడీషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ తో కలిసి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తో కలిసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం .. ఇప్పటికే హైదరాబాద్ లో కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను పట్టుకుంది. నగర శివార్లలో ఇల్లీగల్ గా డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీలను సీజ్ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసింది.