- చేవెళ్ల నియోజకవర్గం గుండాల గ్రామంలో పంట క్షేత్రాల సందర్శన
హైదరాబాద్, వెలుగు: రైతులతో దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా గురువారం చేవెళ్ల నియోజకవర్గంలోని గుండాల గ్రామంలో సీఎండీ పర్యటించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పంట క్షేత్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సమస్యలను రైతులను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ అందించి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం కింద 81 గ్రామాలను గుర్తించినట్లు సీఎండీ ప్రకటించారు.
