భారీ వర్షాలతో సదరన్ డిస్కంకు భారీ నష్టం

భారీ  వర్షాలతో సదరన్ డిస్కంకు భారీ నష్టం
  • విరిగిన 1,357 స్తంభాలు,  దెబ్బతిన్న ఫీడర్లు, ట్రాన్స్​ఫార్మర్లు
  • అంధకారంలో 15గ్రామాలు..10 గ్రామాల్లో పునరుద్ధరణ
  • పరిస్థితిపై సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ రివ్యూ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. విరిగిన కరెంటు స్తంభాలు, దెబ్బతిన్న ఫీడర్లు, ట్రాన్స్‌‌ఫార్మర్లు, సబ్‌‌స్టేషన్లలోకి చేరిన వరద నీరు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెదక్, నల్గొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు వెల్లడించారు. 

సదరన్ డిస్కం పరిధిలో మొత్తం 1,357 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, 280 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌ఫార్మర్లు, 33 కేవీ ఫీడర్లు 39, 11 కేవీ ఫీడర్లు 296 దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో అత్యధిక నష్టం సంభవించింది.అక్కడ 971 విద్యుత్ స్తంభాలు, 262 ట్రాన్స్‌‌ఫార్మర్లు,  33 కేవీ ఫీడర్లు11,  11 కేవీ ఫీడర్లు 175 దెబ్బతిన్నాయి. వందల కిలోమీటర్ల విద్యుత్ లైన్లు కూడా భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వరద నీరు సబ్‌‌స్టేషన్లలోకి చేరడం వల్ల విద్యుత్ సరఫరా స్తంభించిందని పేర్కొన్నారు.

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

విపత్కర పరిస్థితుల్లోనూ విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. మెదక్ జిల్లాలో వరదల కారణంగా 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోగా.. సిబ్బంది కృషితో బుధవారం రాత్రి నాటికి 10 గ్రామాల్లో కరెంట్ వచ్చింది. అయితే, దెబ్బతిన్న రోడ్లు, కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా మిగిలిన గ్రామాల్లో కరెంట్ సప్లయ్ ఆలస్యమైంది. గురువారం రాజీపేట వద్ద నదిలోకి దిగి ఫీడర్ మరమ్మతు చేసిన సిబ్బంది.. అక్కడ సరఫరాను పునరుద్ధరించారు.

అధికారుల సమీక్ష

గురువారం సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ.. చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో  టెలీకాన్ఫరెన్స్‌‌ నిర్వహించి, విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వరదలు కొనసాగుతుండటంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని చీఫ్ ఇంజినీర్ (రూరల్ జోన్) బాలస్వామి సీఎండీకి తెలియజేశారు.విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే అతి తక్కువ టైంలో సరఫరా పునరుద్ధరణ సాధ్యమైందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రశంసించారు. పనులు జరిపేటప్పుడు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి, వరదలను లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.