వాషింగ్టన్: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి భూమి మీదకు తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రోనాట్లకు అనుకోని సమస్య వచ్చింది. వారొచ్చే స్పేస్ఎక్స్ క్యాప్సూల్‌లో టాయిలెట్ పాడైపోయింది. దీంతో ఆస్ట్రోనాట్లంతా డైపర్లు పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శుక్రవారం నాసా ఆస్ట్రోనాట్ మేగన్ మెక్ ఆర్థర్.. ఈ సమస్యపై మాట్లాడారు. ఐఎస్ఎస్ నుంచి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమస్యను వివరించారు. ‘‘స్పేస్‌ఫ్లైట్‌లో చిన్నచిన్న సవాళ్లు ఎన్నో ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, వాటన్నింటినీ మేనేజ్ చేసుకోవచ్చన్నారు. వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం మెక్ఆర్థర్ సహా నలుగురు ఆస్ట్రోనాట్లు భూమికి తిరిగొచ్చే అవకాశాలున్నాయి. నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా.. ప్రతికూల వాతావరణం, ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడం వంటి కారణాలతో వాయిదా వేశారు. ఇప్పుడు ఈ టాయిలెట్ సమస్య వచ్చి పడింది. ఇప్పటికీ మిషన్ ఉంటుందా.. ఉండదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 6 నెలలుగా అంతరిక్షంలో శ్రమించామని ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెస్క్వెట్ అన్నారు. ఐఎస్ఎస్ పవర్ గ్రిడ్‌ను అప్డేట్ చేసేందుకు, స్టేషన్‌ను విసిరిపారేసిన రష్యన్ స్పేస్‌షిప్‌ల థ్రస్టర్లను (ఇంజన్లు) ఆపేందుకు కఠినమైన స్పేస్‌వాక్‌లు చేశామని చెప్పారు.
క్యాప్సూల్ భద్రమే
నిజానికి సెప్టెంబర్‌లోనే స్పేస్ఎక్స్ క్యాప్సూల్‌లో సమస్యను గుర్తించారు. ఓ ట్యూబ్ ఊడిపోయి మూత్రమంతా క్యాప్సూల్‌లో పడిందంటున్నారు. ఎక్కడ చూసినా అదే ఉందని చెప్తున్నారు. తర్వాత సమస్యను పరిష్కరించినా.. వాడుకోవడానికి మాత్రం పనికిరాదని తేల్చారు. ట్యూబ్ ఊడి మూత్రం పడినా.. క్యాప్సూల్ సురక్షితమేనని ఇంజనీర్లు చెప్తున్నారు. ముప్పేమీ లేదంటున్నారు. మెక్ఆర్థర్, పెస్క్వెట్లతో పాటు నాసా ఆస్ట్రోనాట్ షేన్ కింబ్రో, జపాన్ ఆస్ట్రోనాట్ అకిహికో హొషిడేలు భూమికి తిరిగి రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్28న వాళ్లు ఐఎస్ఎస్కు వెళ్లారు.
