మీరున్నది గల్లీలో కాదు.. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి.. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఫైర్

మీరున్నది గల్లీలో కాదు.. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి.. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఫైర్
  • ‘సర్’పై చర్చకు ప్రతిపక్షాల పట్టు
  •     ప్లకార్డులతో నిరసన..
  •     మూడో రోజూ వాయిదాల పర్వం
  •     ఆపరేషన్ సిందూర్​పై చర్చించేందుకు డేట్ ఫిక్స్
  •     ఈ నెల 28న లోక్​సభలో, 29న రాజ్యసభలో డిబేట్

న్యూఢిల్లీ: ఉభయ సభల్లో మూడో రోజు బుధవారమూ.. అపోజిషన్ పార్టీ సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. ‘సర్.. వాపస్ లో..’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని వెల్​లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సభ్యులను అటు లోక్​సభలో స్పీకర్.. ఇటు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ సముదాయించినా వినిపించుకోలేదు. 

రోజంతా వాయిదాల పర్వం కొనసాగింది. లోక్​సభ 11 గంటలకు ప్రారంభమైన వెంటనే.. అపోజిషన్ పార్టీల సభ్యులు నిలబడి బిహార్​లో చేపడ్తున్న ఓటర్ల సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) వాపస్ లో..’’అంటూ పట్టుబట్టారు. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడి, సీజ్​ఫైర్​పై ట్రంప్ ప్రకటనలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ‘‘వీధుల్లో నిలబడి నిరసన తెలియజేస్తున్నట్లు ఉంది. సభా గౌరవ మర్యాదలను కాపాడాలి. లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటది. లోకసభ అనుకుంటున్నారా? లేకపోతే గల్లీ అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా మీరు ప్రవర్తించాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు స్వతహాగా 

ముందుకు రావాలి. కానీ.. మీరు గల్లీల్లో నిరసన తెలియజేస్తున్నట్లు బిహేవ్ చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

లోక్​సభలో స్పోర్ట్స్ బిల్లు ప్రవేశపెట్టిన మాండవీయ

సభ మళ్లీ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులంతా నిలబడి నిరసన తెలియజేశారు. క్వశ్చన్ అవర్ జరుగుతుండగా.. వెల్​లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిరసనల మధ్యే క్వశ్చన్ అవర్ కొనసాగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు 2025ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సెషన్ ను సభ అధ్యక్షుడు, టీడీపీ నేత క్రిష్ణ ప్రసాద్ తొలుత 2 గంటలకు, ఆ తర్వాత గురువారానికి సభను వాయిదా వేశారు.

పెద్దల సభలో ‘సర్’​పై చర్చకు పట్టు

రాజ్యసభలోనూ అపోజిషన్ పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. బీహార్​లో చేపడ్తున్న ఓటర్ల సవరణపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ అధ్యక్షుడు భువనేశ్వర్ కలిట.. సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు పోస్ట్​పోన్ చేశారు. 

2 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సభ్యుల నిరసనల మధ్యే షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ‘‘క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు 2025’’ను ప్రవేశపెట్టారు. ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925ను తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు రిప్లేస్ చేయనున్నది. సముద్ర మార్గం ద్వారా వ్యాపారం మరింత సులభతరం చేసేందుకు ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ బిల్లు గురించి ఏఐఏడీఎంకే ఎంపీ ఎం.తంబిదురై మాట్లాడుతుండగా.. ప్రతిపక్షాల ‘సర్’ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభ అధ్యక్షుడు ప్రకటించారు.

16 గంటల పాటు చర్చకు ఓకే

ఆపరేషన్ సిందూర్​పై 2 రోజుల పాటు చర్చించాలని రాజ్యసభ సభ్యులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. లోక్​సభలో ఈ నెల 28వ తేదీన 16 గంటల పాటు ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ అటాక్​పై చర్చిస్తారు. ఆ తర్వాత 29వ తేదీన రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చిస్తారు. చర్చలో ప్రధాని మోదీ పాల్గొనాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.