- అమలుకు మెట్రోవాటర్ బోర్డు, సీఎంసీ నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలోని దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని మెట్రోవాటర్ బోర్డు, సీఎంసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాటర్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, సైబరాబాద్ రీజియన్ ఈడీ మండలా సంతోష్ తదితరులు దుర్గం చెరువును శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మాదాపూర్, సైలెంట్ వ్యాలీ, విఠల్ రావు నగర్, టీజీఐఐసీ లేఅవుట్ నాలాల ద్వారా చెరువులోకి మురుగునీరు చేరుతున్నట్లు గుర్తించారు. నివాసాలు, జనాభా వేగంగా పెరగడంతో మురుగునీటి ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు తేల్చారు. మురుగునీరు చెరువులో కలవకుండా నిరోధించేందుకు 4 ప్రధాన ఇన్‌లెట్ల వద్ద మురుగునీటి మళ్లింపు, శుద్ధి వంటి శాశ్వత సాంకేతిక చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
