దళిత ధిక్కార కేతనం.. పసునూరి సాహిత్య ప్రస్థానం

దళిత ధిక్కార కేతనం.. పసునూరి సాహిత్య ప్రస్థానం

‘‘కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి పంజరాన గట్టు వడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’’ మహాకవి జాషువా కొనసాగింపు సామాజిక ఉద్యమకారులు కవి, రచయిత, గాయకులు, వక్త, విమర్శకులు, పరిశోధకులు బహుముఖ ప్రజ్ఞాశాలి డా. పసునూరి రవీందర్. తన నిత్య జీవిత అనుభవాల నుంచి సామాజిక  జీవిత సత్యాలను లోతైన పరిశీలనతో పర్ఫెక్ట్​గా ఎలా చెప్తే బాగుంటుందో ఆ ప్రక్రియను ఎంచుకొని పాఠకుని హృదయానికి తాకేలాగా సృజన చేయగల నేర్పరి. నగరం నడిబొడ్డున జన్మించి ఆధిపత్యాలపై అక్షరం ఎక్కుపెట్టినవాడు. తను తప్ప వేరే వాళ్లు రాయలేని అంశాలను సామాజిక బాధ్యతతో రాస్తున్న వాడు.

ఆధునిక కాలంలో ఉన్న వివక్షతలకు విరుగుడును సాహిత్యరూపంలో అప్‌‌డేటెడ్‌‌  వెర్షన్​లో సృజిస్తున్నవాడు. అప్​డేటెడ్ సాహిత్యకారుడు. అర్బన్​లో జన్మించిన ఏమాత్రం అర్బన్ కల్చర్​కు ఆకర్షితుడు కాకుండా ఈ తరం సాహిత్యకారులకు మాడ్రన్​గా నిలుస్తున్నవాడు. వరంగల్ శివనగర్​లో ఒక నిరుపేద దళిత కుటుంబంలో వరవ్వ– వీరస్వామి దంపతులకు జన్మించి బతుకు సంఘర్షణలో నుంచి చిక్కబడిన అక్షరమై జ్వలిస్తున్నాడు. సమాజ పురోగతికి పరితపిస్తున్నాడు. 

మామూలు రిక్షా కార్మికుని కొడుకు కూలి తల్లి బిడ్డ, ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధకుడిగా గోల్డ్ మెడలిస్ట్​గా, యాక్టివిస్టుగా ఉద్యమకారునిగా అన్నిటికంటే మానవతావాదిగా మూర్తీభవించాడు. ఇవాళ తెలుగు సాహిత్యంలో ముందు వరుసలో ఉన్న అప్​డేటెడ్ కవి, రచయిత. తాను కాలం చెల్లిన ప్రాచీన గ్రామీణ వ్యవస్థలో ఉన్న వివక్షతలను ఏమాత్రం చూడలేదు. కానీ, తను అనుభవించిన, కండ్ల నిండా చూసిన అర్బన్ లోని వివక్షతలకు అక్షర రూపం ఇస్తున్నాడు. ఎక్కడ కాటగలవకుంట, గాడుపులో కొట్టుకుపోకుండా ధైర్యంగా సాహిత్య లడాయి చేస్తున్నాడు. 

డాక్టర్ పసునూరి మంచి స్నేహశీలి. మృదుస్వభావి. మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్లను ప్రేమిస్తాడు. అందరితో కలిసి మెలిసి ఉండే సున్నితమైన మనసు ఉంది కనుకనే, తన తోటి వాళ్ల బాధలను తన బాధలుగా భావిస్తాడు. ఈ సమాజ దుఃఖాన్ని తన దుఃఖంగా తలచి కవితగానో పాటగానో వ్యాసముగానో కథగానో ఏదో ఒక రూపంలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా  నిక్కచ్చిగా ప్రతిభావంతంగా వ్యక్తపరిచే రచయిత. 

తన అంతరంగంలో ఘర్షణ పడుతున్న భావాలను అక్షర రూపం ఇచ్చేదాకా నిద్రపోడు, నిద్రపోనివ్వడు. నిరంతరం అధ్యయనం చేస్తూ ఎక్కడా ఆగిపోకుండా సాగిపోతున్నాడు. నేటి రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత తాత్విక జీవన అస్తిత్వ మూలాలను పట్టుకొని కవిగానే కాకుండా ఒక కాపరిగా ఒక లెజెండ్​గా అందరినీ ఐక్యపరుస్తూ సమాజ రుగ్మతుల మీద పోరాటం చేస్తున్నాడు. ఈ దేశంలో వివక్షత పల్లెల్లో, పట్టణాల్లో రూపాలు వేరైనా ఏదోరకంగా మనిషిని కాటు వేస్తూనే ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక పక్క కుల, మత, లింగ వివక్షలతో దాడులు, హత్యలు అవమానాలు అణిచివేతలు అత్యాచారాలు అవమాన సంఘటనలు నిత్యకృత్యమైపోయాయి. 

మనిషి ప్రపంచీకరణ ప్రభావంతో సామ్రాజ్యవాద విషవలయంలో, టెక్నాలజీ మాయలో పడి ఆగమాగం అవుతున్నాడు. దాంతో మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. మనిషిని మనిషిగా ప్రేమించలేని పాపపు కాలం దాపురించింది. పల్లెలు ఆగమైతున్నాయి. పట్నాలు కాటగలుస్తున్నాయి. గ్లోబల్ కల్చర్ సున్నితమైన మానవ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. నేటి సమాజానికి జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. జీవించే ఆకాంక్షను, మానవ విలువలను దిశా నిర్దేశం చేసే అక్షరాలు ఎంతో అవసరం. ఇలాంటి సందర్భంలో క్రియాశీలక కార్యకర్తగా సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. 

ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, జీవించే తృష్ణనను పెంపొందింపజేయాలి. అలాంటి మనిషితనానికి మార్గనిర్దేశం చేసేదే సాహిత్యం. అట్లా డాక్టర్ పసునూరి తన సాహిత్యంలో ఆధునిక కాలాన్ని రికార్డ్ చేస్తున్న కవి. ఆ కృషి కేవలం దళిత సాహిత్యానికే పరిమితం కాదు. ప్రాపంచిక దృక్పథంతో విస్తృతమవుతుంది. వర్గ, వర్ణ వ్యవస్థలతో సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన అక్షరాల ఫిరంగి పసునూరి. సమాజంలోని అన్ని పార్శ్వాల పట్ల తనదైన శైలిలో, స్పష్టమైన భావజాలంతో రచనలు చేస్తున్నాడు. 

వర్ణ, వర్గ ఆధిపత్య భావనలో ఎక్కడ ఒత్తిడికి, ఆవేశానికి, తొందరపాటుకు, ప్రలోభాలకు లోనుకాడు. సామాజిక బాధ్యతతో అంబేద్కర్ చూపిన రాజకీయ చైతన్య స్ఫూర్తితో కలాన్ని ఝుళిపిస్తాడు. అట్లా సమసమాజ స్థాపన కోసం సాహితీ సేద్యం చేస్తాడు. స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం భావాలను తన అక్షరాల్లో పలికిస్తాడు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, మహనీయుల ఆశయాలను ఆత్మగతం చేసుకుంటాడు. సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పునర్జీవనానికి.. ఒక సైనికునివలె నిరంతరం తన  కలంతో కావలి కాస్తున్నవాడు డాక్టర్ పసునూరి. ఆయన కలం నుండి పలు రచనలు వెలవడినవి. 

లడాయి (దీర్ఘ కవిత) అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా (దళిత కథలు) తెలంగాణ ఉద్యమ పాట (పరిశోధన) ఇమ్మతి (విమర్శ) ఒంటరి యుద్ధభూమి (కవిత్వం) గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ (పరిశోధన) పోటెత్తిన పాట (విమర్శ) కండీషన్స్ అప్లయ్ (కథలు) కల్చరల్ కమాండర్ మాస్టార్జీ (మోనోగ్రాఫ్) మట్టి మేధావి కొల్లూరి సత్తయ్య (ఆత్మకథ) పసునూరి పంచ్ (మినీ కవిత్వం) ఇలా అలుపెరుగక సాహిత్యాన్ని సృష్టిస్తున్నవాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలకు గాను తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి రచయిత . 

తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ వారి ఉత్తమ కథకుని అవార్డు, ఉత్తమ పరిశోధనకు గాను తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ అమెరికా వారిచే సురవరం ప్రతాపరెడ్డి పునర్జీవన గౌరవ పురస్కారంతో పాటు భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారిచే సాహిత్య రత్న అవార్డు,  కాళోజీ జాతీయ పురస్కారం, సుద్దాల హనుమంతు, గిడుగు, గూడా అంజన్న, జైనీ, దబరసం, కళాభిరామ పురస్కారాలు, జాషువా సాహిత్య పురస్కారం వంటివి ఎన్నో తన కృషికి అందివచ్చాయి. 

పసునూరి రచనలు పలు విశ్వవిద్యాలయాల్లో సిలబస్ గాను ఆధార గ్రంథాలుగా ఉన్నాయి. తన రచనలపై పరిశోధనలు జరిగాయి. అలాగే పోటీ పరీక్షల్లో సైతం ఈ రచనలపై ప్రశ్నలు రావడం జరిగింది. జాతీయ సెమినార్లలో పసునూరి రచనలపై పరిశోధకులు పత్ర సమర్పణలు చేశారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్​ప్రెస్ 2024లో చదవాల్సిన భారతీయ సాహిత్య జాబితాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలు అరుంధతీరాయ్, సల్మన్ రష్దీలతో పాటు పసునూరి రవీందర్ కథల్ని కూడా పేర్కొనడం విశేషం. 

తన రచనలు హిందీ, కన్నడ, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లోకి అనువాదమయ్యాయి.  జాషువా తర్వాత మద్దూరి నగేష్ బాబు, పైడితరేష్ బాబు, నాగప్ప గారి సుందర్రాజు, ఎండ్లూరి సుధాకర్ల స్థాయిలో దళిత సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న దళిత ధిక్కార స్వరం పసునూరి. 
 

(ఏప్రిల్ 1న పసునూరి రవీందర్​కు శంభూక అవార్డును ప్రదానం చేస్తున్న సందర్భంగా...)

- డా.పొన్నాల బాలన్న 
కవి, రచయిత

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
featureseditor@v6velugu.com