స్మారక కేంద్రం ఏర్పాటు గర్వకారణం..మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు

స్మారక కేంద్రం ఏర్పాటు గర్వకారణం..మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ అమరుల త్యాగాల దృశ్యరూపాలను జ్వలించే జ్యోతిలో చూసుకునే విధంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. అమర వీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన  విడుదల చేశారు. "ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన యువతను మరువలేం. 

శ్రీకాంతాచారి ఆత్మార్పణ దృశ్యాలు ఇప్పటికీ నన్ను కలచివేస్తున్నాయి. ఆయన ధైర్యంగా మృత్యువుతో పోరాడుతున్న సమయంలో నేను హాస్పిటల్ కు పోయి పరామర్శిం చాను. ఆ సమయంలో నా చొరవతోనే  శ్రీకాంతాచారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. " అని విద్యాసాగర్ రావు వెల్లడించారు. లోక్ సభలో అప్పటి కేంద్ర మంత్రి  సుష్మా స్వరాజ్ ‘మీరు బలిదానం కావద్దు.. తెలంగాణను చూసి బతకాలి”అంటూ ఉద్వేగంతో చేసిన ప్రసంగం కూడా చరిత్రాత్మకమైందని, తెలంగాణ ఉద్యమ గీతాలను వింటూ ఆమె కంటతడి పెట్టారని తెలిపారు.