- ప్రతి జిల్లా అవసరాలకు అదనంగా నిధులు
- రాష్ట్ర సర్కారు సూత్రప్రాయ నిర్ణయం
- కరువు సాయం కోసం కేంద్రానికి రిక్వెస్ట్
- సెంట్రల్ నుంచి నిధులు ఆలస్యమైనా..
- రాకపోయినా.. రాష్ట్ర నిధి నుంచే రిలీజ్
- గడిచిన 3 నెలల్లోనే విద్యుత్ కొనుగోళ్లకు
- దాదాపు రూ.3 వేల కోట్ల వ్యయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ముప్పుతో ముంచుకొస్తున్న తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా, వ్యవసాయానికి, గృహాలకు కరెంట్ కొరత తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా రూ.6 వేల కోట్ల ‘స్పెషల్ ఫండ్’ కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఎల్‌నినో వల్ల ఏర్పడే కరువు, పంట నష్టాలు, నీరు, విద్యుత్ సమస్యలను తట్టుకునేందుకు జాతీయ విపత్తుల స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద తక్షణమే రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
అయితే, అక్టోబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్టు తాజా నివేదికలు స్పష్టం చేయడంతో.. కేంద్రం నుంచి కోరే సహాయాన్ని రూ.30 వేల కోట్లకు పెంచాలని తాజాగా ప్రతిపాదించింది. కేంద్రం నుంచి నిధులు రావడంలో జాప్యం జరిగినా లేదా రాకపోయినా వేచి చూడకుండా, ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర సొంత ఖజానా నుంచే నిధులు వెచ్చించనుంది.
తొలివిడతగా జిల్లాలకు రూ.50 కోట్లు
అత్యవసర పనుల నిమిత్తం తొలి విడతగా జిల్లాలకు రూ.50 కోట్లు విడుదల చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇక గడిచిన మూడు నెలల్లోనే కరెంట్ కొనుగోళ్లకు దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. కరువు తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బావులపై విద్యుత్ మోటార్ల వాడకం విపరీతంగా పెరగడమే ఈ స్థాయిలో నిధులు వెచ్చించాల్సి రావడానికి ప్రధాన కారణమైంది.
అక్టోబర్ 15న ఉదయం 10.29 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 20,003 మెగావాట్ల ఆల్‌టైమ్ పీక్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ ఒక్క రోజే ఏకంగా 334.54 మిలియన్ యూనిట్ల భారీ విద్యుత్ వినియోగం కాగా.. గత ఆర్థిక సంవత్సరపు గరిష్ట డిమాండ్ 18,548 మెగావాట్లను ఇది ఏకంగా 1,455 మెగావాట్ల తేడాతో తుడిచిపెట్టేసింది.
రాబోయే వేసవి సీజన్ నాటికి పీక్‌లోడ్ ఏకంగా 23 వేల నుంచి 24 వేల మెగావాట్లకు చేరవచ్చని అధికారులు లెక్కగట్టారు. 315 కరువు మండలాల్లో వ్యవసాయ ఫీడర్లు ట్రిప్ కాకుండా నిరంతర విద్యుత్ ఇవ్వడానికి, బహిరంగ మార్కెట్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడానికి, సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచడానికి ఈ రూ.6 వేల కోట్ల నిధి వినియోగించనున్నట్టు తెలుస్తున్నది.
రిజర్వాయర్ల నీటి నిర్వహణపై ఆంక్షలు
కరెంట్ డిమాండ్‌తోపాటు తాగునీటి వ్యవస్థలు కుప్పకూలకుండా ఉండేందుకు జలాశయాల నీటి నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మిషన్ భగీరథ ద్వారా నల్లా నీటిని అందించే కృష్ణా బేసిన్‌లోని 36 రిజర్వాయర్లు (కృష్ణా పరిధిలోనివి 14, పీహెచ్‌ఎంఈడీ 22), గోదావరి బేసిన్‌లోని 26 జలాశయాల్లో నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి.
అక్టోబర్ నాటి రికార్డుల ప్రకారం.. ఎస్సారెస్పీలో 48.58 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 18.17, మిడ్ మానేరులో 23.42, ఎల్ఎండీలో 15.42, మల్లన్నసాగర్‌లో 12.78, జురాలలో కేవలం 9.65 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీంతో నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా సాగునీటి కాల్వల తూములను కట్టడి చేసి, కేవలం తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. ఎండల తీవ్రతతో ఆవిరి నష్టాలు పెరిగి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు, అత్యవసర మోటార్లు బిగించి ‘డెడ్ స్టోరేజ్’ నుంచీ నీటిని తోడి పట్టణాలు, పల్లెలకు అందించే సాంకేతిక పనులకు ఈ స్పెషల్ ఫండ్ నుంచి నిధులను కేటాయించనున్నారు.
ఈ ప్రత్యేక నిధులను కేవలం రాష్ట్ర స్థాయిలోనే ఉంచకుండా ప్రతి జిల్లా అవసరాలకు తగ్గట్టుగా కలెక్టర్ల పర్యవేక్షణలో పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధమైంది. భూగర్భ జలాలు పాతాళానికి చేరిన 315 కరువు మండలాలు, తాగునీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌ను వెచ్చించనున్నారు.
తొలి విడతగా జిల్లాలకు ఇచ్చే రూ.50 కోట్లతో ఎండిపోయిన తాగునీటి బోర్ల పునరుద్ధరణ, ఫ్లషింగ్, డీపెనింగ్, కొత్త బోర్ల తవ్వకం, పైప్‌లైన్ లీకేజీల అరికట్టడం, ఓవర్‌హెడ్ ట్యాంకుల రిపేర్లు చేపట్టనున్నారు. తీవ్ర కొరత ఉన్న ఆవాసాలకు ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు అధిక లోడ్ వల్ల కాలిపోయే వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను గంటల వ్యవధిలోనే మార్చేలా డిస్కం యంత్రాంగానికి నిధులు సర్దుబాటు చేయనున్నారు.
కేంద్ర విపత్తు సహాయ నిధుల మంజూరు ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున, ప్రజలు నీరు, కరెంట్ కష్టాలతో అల్లాడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సొంతంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో కోరిన రూ.20 వేల కోట్లను క్షేత్రస్థాయి తీవ్రత దృష్ట్యా రూ.30 వేల కోట్లకు పెంచాలని నిర్ణయించినప్పటికీ.. కేంద్రం ఇచ్చేదాకా వేచి చూడకుండా సొంత నిధులతోనే పనులన్నీ పూర్తి చేయాలని తీర్మానించింది.
సెక్రటేరియెట్‌లో ఎనర్జీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో ఏర్పాటైన 24 గంటల ‘వార్ రూమ్’ ద్వారా మండలాలవారీగా తాగునీరు, విద్యుత్ సరఫరాను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్వయంగా మానిటర్ చేస్తోంది. కలెక్టర్లు ప్రతి వారం రివ్యూలు నిర్వహిస్తూ.. అత్యవసర పనులకు అక్కడికక్కడే స్పాట్ డెసిషన్స్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. నిధుల కొరత లేకుండా చూస్తున్నందున సరఫరాలో ఎలాంటి విఘాతం కలిగినా, నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై తక్షణమే సస్పెన్షన్ వేటు తప్పదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
