జూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ..ప్రతి ఇంటికీ మూడు సార్లు రానున్న బీఎల్ఓలు

 జూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ..ప్రతి ఇంటికీ మూడు సార్లు రానున్న బీఎల్ఓలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ లిస్టును రెడీ చేయడానికి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)' ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ప్రకారం..ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ముగుస్తుంది.

ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు స్వయంగా వచ్చి ఓటర్ల వివరాల ఫారాలను (ఎన్యూమరేషన్ ఫారం) పంపిణీ చేస్తారు. వాటి ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తారు. ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా కూడా ‘voters.eci.gov.in’ వెబ్‌సైట్‌లో ఈ ఫారాన్ని సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన సమాచారంతో జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

ఆ నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఒకవేళ కొత్తగా చిరునామా మార్చుకోవాలంటే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈసీ అవకాశమిచ్చింది. కుటుంబ సభ్యులు ఎవరైనా ఊర్లో లేకపోయినా లేదా విదేశాల్లో ఉన్నా వారి తరఫున ఇంట్లోని పెద్దలు ఫారాలపై సంతకం చేసి బీఎల్ఓలకు అందించవచ్చు. ఏవైనా సందేహాలుంటే ఓటర్లు 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.