
- కలెక్టర్లకు చేరిన లిస్ట్
- 1న ఉత్తర్వులు ఇవ్వనున్న సర్కారు
- గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల ఎంపిక పూర్తయింది. పంచాయతీల వారీగా నియమిస్తున్న ఆఫీసర్ల లిస్ట్ ను మండల అధికారులు, డీపీవోలు, కలెక్టర్లకు పంపించారు. ఈ లిస్ట్ బుధవారం పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులకు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 1న సర్పంచ్ ల టర్మ్ పూర్తి కానుండటంతో అదే రోజు స్పెషల్ ఆఫీసర్ల పాలనపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. స్పెషల్ ఆఫీసర్లపై ప్రభుత్వం పలు గైడ్ లైన్స్ జారీ చేయనుంది. రెండో తేదీన అధికారులకు కేటాయించిన జీపీల్లో వారు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇప్పటికే సర్పంచ్ ల నుంచి సెక్రటరీలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12769 గ్రామ పంచాయతీలు ఉండగా మేజర్ గ్రామ పంచాయతీల్లో గెజిటెడ్ ఆఫీసర్లను నియమించగా మిగత చోట్ల సూపరిటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మిషన్ భగీరథ ఏఈ, రెవెన్యూ, ఎడ్యుకేషన్ ఇలా అన్ని శాఖలకు చెందిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా అధికారులు నియమించారు.
3న వీడియో కాన్ఫరెన్స్
జీపీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానున్న నేపథ్యంలో 3వ తేదీన పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రివ్యూలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్ డీ వో, డీఎల్ పీవో, మిషన్ భగీరథ ఈఈలు, ఎంపీడీవోలు, ఎండీవోలు, సెర్ప్, పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొనాలని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. అధికారులంతా పూర్తి సమాచారంతో అటెండ్ కావాలని పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు సర్పంచ్ , సెక్రటరీలకు చెక్ పవర్ ఉండగా, వచ్చే నెల 2 నుంచి సర్పంచ్ ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ కు చెక్ పవర్ అధికారం దక్కనుంది.