గురుపూర్ణిమ 2025: గురువు అంటే ఎవరు.. పురాణాల్లో ఏముంది..!

గురుపూర్ణిమ 2025:  గురువు అంటే ఎవరు.. పురాణాల్లో ఏముంది..!

సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.

గురువును భగవంతునికన్నా ఉన్నతంగా భావించే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందీ అంటే అది హిందూదేశం మాత్రమే. ప్రపంచ దేశాలలో ఎక్కడా గురువు అనే భావనే ఉండదు. గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారుచేస్తారు.గురువు అంటే చీకటిలో నుండి వెలుతురులోకి తీసుకువచ్చేవాడని నిర్వచిస్తూ ఉంటారు.అజ్ఞానులను జ్ఞానమార్గం వైపు నడిపించి, మార్చగలిగేది గురువు మాత్రమే.గురువు కొరకు పరితపిస్తూ అన్వేషిస్తేనే సద్గురువు లభిస్తాడు. గురువును భక్తితో పూజించాలి. మనలో మనకు తెలియకుండా నిద్రాణమై ఉన్న అహాన్ని తొలగించేది గురువు మాత్రమే.

ఆషాఢ శుద్ధపౌర్ణమి ని గురుపూర్ణిమ...వ్యాసపూర్ణిమ అని అంటారు. ఈ రోజున (జులై 10) గురువులను పూజించి , గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని , వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 

‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’

 గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి , పూజించి , జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. 

 గురువు సహాయం తోను, హిందూ తత్వశాస్త్రంలోని పునర్జన్మతో  కర్మ ప్రక్రియ ద్వారా అనేక విషయాలతో పాటు, మానసిక జ్ఞానోదయానికి, స్వీయ సాక్షాత్కారానికి సహాయపడే వ్యక్తి గురువు. ఆయన ఒక ఆదర్శ వ్యక్తి..  శిష్యుని ఆధ్యాత్మిక అభివృద్ధికి.. జీవితంలో ఉన్నతస్థానం చేరేందుకు  మార్గనిర్దేశం చేసేవాడు. హిందూ సంస్కృతిలో గురువుకు చారిత్రక, గౌరవప్రదమైన, ముఖ్యమైన పాత్ర ఉంది.

జ్ఞానమార్గం చూపించే గురువు..

ఒకరోజు ఒక మహారాజు సాయం సంధ్యా సమయంలో నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ అక్కడ తన గురుదేవులు కౌపీనమునకు పడిన చిల్లులను సూదీదారంతో కుట్టుకొనుట చూసాడు.గురువును సమీపించి గురుదేవా... మీరు నా గురువులు, మీరు ఇలా కౌపీనము కుట్టుకొనుట బాగులేదు. కౌపీనము అంతా చిల్లులమయంగా ఉంది... అన్నాడు.

గురువుగారు ”అయితే?” అని ప్రశ్నించారు.దానికి సమాధానంగా “నేను మహా రాజును, మీకు ఏమి కావాలన్నా ఇస్తాను” అని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ గురువుగారు రాజులో ఉన్న అహాన్ని మాటల ద్వారా గ్రహించారు. ఆయన ..రాజా నువ్వు ఏమైనా ఇవ్వ గలవా..! అని ప్రశ్నించారు...ఓ! ఇస్తాను అని గర్వంగా అన్నాడు రాజు.

గురువు తన చేతిలో ఉన్న సూదిని నదిలోకి విసిరి దానిని తీసుకురమ్మన్నాడు.రాజు నివ్వెరపోయాడు. రాజుకు తనలోని అజ్ఞానం అర్థమైంది. గురువు పాదాలకు సవినయంగా నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించాడు.

  • గురువు భగవంతునికన్నా శక్తిమంతుడు. గురువు కోరికలను తీర్చడు. శిష్యునికి ఏది అవసరమో దానిని ఇస్తాడు. ఒక మహానుభావుడు గురువును గూర్చి చెబుతూ గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కాని వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గురువు గొడుగులాంటి వాడు అని అన్నాడు.
  • కబీరు తన దోహాలో గురువు, గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు గురువుకు నమస్కారం చేస్తానని వ్రాసాడు. కారణం గోవిందుని వర్ణించి చెప్పినది గురువే కాబట్టి.
  • అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు తదితరులందరూ గురువులవద్ద విద్యనభ్యసించినవారే.

ముల్లోకాలను ఉద్దరించిన మహా పురుషులు .. అవతార పురుషులు కూడా .. గురువుద్వారానే విద్యనభ్యసించారు.  అలాంటి గురువులను ఈ ఈరోజు ( జులై10)న ఒకసారి గుర్తుచేసుకొని.. వీలయితే వారి దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేసి గురువుగారి ఆశీర్వాదం పొందుదాం. . .