అదే నాకు ప్లస్ అయింది : జైన్​ ఖాన్​ దురానీ

అదే నాకు ప్లస్ అయింది :  జైన్​ ఖాన్​ దురానీ

ఒక నటుడికి ముక్కు, ముఖం చక్కగా ఉండాలి. స్క్రీన్​పై అందంగా కనిపించాలి. ఏ ఎక్స్​ప్రెషన్​ అయినా కళ్లతో మెస్మరైజ్​ చేసేలా ఉండాలి. ఇవి ఉంటే మంచి​ యాక్టర్​ అవ్వొచ్చు. అయితే, జైన్​ ఖాన్​ దురానీకి వీటన్నింటితో పాటు తన వాయిస్​ కూడా ప్లస్​ అయింది. అందుకే మొదటి సినిమాలో ఆర్జే క్యారెక్టర్​తో యూత్​ని అట్రాక్ట్ చేశాడు. లేటెస్ట్​గా తన మొదటి వెబ్​ సిరీస్​ ‘ముఖ్​​బీర్​..’లో ఏజెంట్​ పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కశ్మీర్​ బ్యాక్​డ్రాప్​లో జరిగే ఈ సిరీస్​లో, ఒరిజినల్​గా కశ్మీరీవాడైన జైన్​ పర్సనల్​ లైఫ్, ఈ సిరీస్​ ఎక్స్​పీరియెన్స్​, తన కెరీర్​ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు తన మాటల్లోనే...

నా అసలు పేరు నయీన్ ఖాన్ దురానీ. మాది జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్. అమ్మ సైకాలజీ ప్రొఫెసర్, నాన్న డాక్టర్. నేను బర్న్​ హాల్ స్కూల్​, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలోని జాకీర్ హుస్సేన్ కాలేజీ నుండి కామర్స్​లో డిగ్రీ చేశా. మా అమ్మానాన్నలకు నన్ను ఐఎఎస్​గా చూడాలని కోరిక. అందుకని గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను సివిల్ సర్వీసెస్​​ ఎగ్జామ్స్​కి ప్రిపేర్ అయ్యా. అప్పటివరకు నాకంటూ ఒక గోల్​ లేదు. కానీ, చిన్నప్పటి నుంచే నాకు కవితలు రాయడం ఇష్టం. అలాగే స్కూల్, కాలేజీల్లో చదువుతున్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్​లో పార్టిసిపేట్ చేసేవాడిని. నాకు నాటకాలు, కవితలు అంటే ఇష్టం పెరిగిపోవడంతో అవైతే నేను బాగా చేయగలను అనిపించింది. దాంతో అమ్మానాన్నలకు నచ్చజెప్పా. ‘కుచ్ బీగె అల్ఫాజ్’తో 2018లో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఆ సినిమాలో నాది రేడియో జాకీ (ఆర్జే) రోల్​​. ఆ తర్వాత 2020లో ‘శిఖర’ అనే సినిమాలో లతీఫ్​ రోల్​లో నటించా. ఆ వెంటనే 2021లో అక్షయ్​ కుమార్ హీరోగా చేసిన ‘బెల్​ బాటమ్​’లో విలన్​ రోల్ చేశా. అందులో నా క్యారెక్టర్ ఐ.ఎస్.​ఐ హైజాకర్​. 

ఆర్జేగా..

నా మొదటి సినిమా ‘కుచ్ బీగె అల్ఫాజ్’లో ఆర్జేగా నటించాక రియల్​ లైఫ్​లో కూడా ట్రై చేశా. ఫిక్షన్​ బేస్డ్​ థిమాటిక్​ డ్రామా షో ‘లమ్హే’ సెకండ్​ సీజన్​లో యాంకర్​గా చేశా. ‘లమ్హే విత్ జైన్’ పేరుతో 2018లో ఆ షో లాంచ్​​ అయింది. అది ఎందుకు చేశానంటే... కథలు చెప్పడం నాకు చాలా ఇష్టం. ఈ షో సెకండ్ సీజన్ థీమ్ విన్నప్పుడు ఎగ్జైట్​ అయ్యా. అప్పటికే నేను ఆర్జేగా సినిమాలో నటించా కదా. ఆ క్యారెక్టర్​ని చాలా బాగా ఎంజాయ్ చేశా. ఆ ఎక్స్​పీరియెన్స్​ నాకు మంచి మెమరీస్​ ఇస్తుందని ఆ షో చేశా. 

నా మొదటి సిరీస్​ ఇదే

‘ముఖ్​బీర్ – ది స్టోరీ ఆఫ్​ ఎ స్పై’ వెబ్​ సిరీస్​తో ఓటీటీలో అడుగుపెట్టా. ఈ సిరీస్​ ఈ నెల 11న జీ5లో రిలీజ్ అయింది. ఎనిమిది ఎపిసోడ్​ల సిరీస్​ తెలుగు, తమిళం, పంజాబీ భాషల్లోకి డబ్​ అయింది. రచయిత మలొయ్​ ధర్​ రాసిన ‘మిషన్ టు కాశ్మీర్ : యాన్ ఇంటెలిజెంట్ ఏజెంట్​ ఇన్ పాకిస్తాన్’ అనే నవల నుంచి ఈ కథ తీసుకున్నారు. ఇందులో నాది ఇండియన్ సీక్రెట్​ ఏజెంట్​ క్యారెక్టర్.1965లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధంలో మనదేశానికి సాయం చేసిన ఏజెంట్​ పాత్ర ఇది. ఢిల్లీకి చెందిన​ అతను చాలా తెలివైనవాడు. కొన్ని స్పెషల్​ స్కిల్స్ కూడా ఉన్నాయి. అందువల్లే తను ఆ జాబ్​కి సెలక్ట్ అయ్యాడు. నిజానికి నేను కాశ్మీర్​ వాడినే కాబట్టి, అక్కడ హింస ఎలా ఉంటుంది? పాలిటిక్స్ ఎలా ఉంటాయి? ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వంటి విషయాల పట్ల అవగాహన ఉంది. ఆ క్యారెక్టర్​ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నేను ఓటీటీలో డెబ్యూ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ‘ముఖ్​బీర్​..’లో చేయడం నన్ను చాలా ఎమోషనల్​గా కూడా టచ్ చేసింది. స్క్రిప్ట్​ చదువుతున్నప్పుడు కూడా ఆ క్యారెక్టర్​ నాకు ఇన్​స్పైరింగ్​గా అనిపించింది. 

గూఢచారిగా..

కాశ్మీర్​లో ఎప్పుడూ ఏదో ఒక హడావిడి ఉంటుంది. రాజకీయపరమైన గొడవలు జరుగుతుంటాయి. చుట్టూ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అవన్నీ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నన్ను మానసికంగా ప్రభావితం చేసేవి. వాటినుంచి బయటపడడానికి, మైండ్​ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చేది. చిన్నప్పుడు వాటి గురించి ఏమీ తెలియదు. కానీ, వయసు పెరిగేకొద్దీ చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన ఉంటుంది. అందువల్ల వాటిని పట్టించుకోకుండా ఉండలేం. ఇలాంటివన్నీ రియల్​గా ఎక్స్​పీరియెన్స్ చేశాను. అయితే, ఈ సిరీస్​ విషయానికొస్తే.. ఇందులో నాది గూఢచారి క్యారెక్టర్​. ఎవరికైనా ఇది చాలా ఛాలెంజింగ్​ రోల్​. అయితే, నాకు ఇక్కడ ఒక అవకాశం దొరికింది. దేశం కోసం ప్రాణాలకు తెగించిన గూఢచారిగా మారిన ఒక ఆఫీసర్​ పాత్ర చేయడం నా అదృష్టం. 

క్యారెక్టర్ ప్రిపరేషన్

ఈ సిరీస్​లో హర్ఫాన్ క్యారెక్టర్​ నాది. దానికోసం చాలా ప్రిపేరయ్యా. షూటింగ్​కి ముందు ఐదారు సార్లు స్క్రిప్ట్ చదువుకునేవాడిని. నా క్యారెక్టర్ మేనరిజం నాకు చాలా హెల్ప్ అయింది. ఓల్డ్​ ఢిల్లీ నుంచి వచ్చినవాడు హర్ఫాన్. తన మాటతీరు వేరుగా ఉంటుంది. చదువుకున్నోడిలా కాకుండా వెటకారంగా మాట్లాడాలి. ఇలాంటివన్నీ తన మేనరిజమ్స్. ఇవన్నీ మైండ్​లో ఉంచుకుని నటించేవాడిని. నేను కూడా చాలా ఏండ్లు ఢిల్లీలో ఉన్నా. దానివల్ల ఆ మాటతీరు అలవర్చుకోవడం నాకు ఈజీ అయింది.  

ఓటీటీని ఎంజాయ్​ చేస్తున్నారు

ఎంతోమంది యాక్టర్స్​కి సినిమాల ద్వారా రాని గుర్తింపు ఓటీటీ ఇచ్చింది. ప్రజలు కూడా ఈ ప్లాట్​ఫాంని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు అరగంట నిడివితో ఉండడం వల్ల వెబ్ సిరీస్​లను బాగా చూస్తున్నారు. థియేటర్​ అయినా, ఓటీటీ అయినా కంటెంట్​ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది ప్రూవ్​ అయింది. నటుడిగా నా పని నేను కరెక్ట్​గా చేస్తే ప్రజలకు దగ్గరవుతాను. అంతేకానీ, నేను నటించేది ఓటీటీలోనా? సినిమా థియేటర్​లోనా అని వాళ్లు చూడరు. నా మొదటి సినిమా గురించి, ఇప్పటికీ నాకు మెసేజ్​లు వస్తుంటాయి. అవి చూసి చాలా హ్యాపీగా ఫీలవుతా. ::: ప్రజ్ఞ

సమ్​థింగ్​ స్పెషల్

  •     నాకు కవితలు రాయడం చాలా ఇష్టం. ఇంగ్లీష్​లో​, ఉర్దూలో రాస్తుంటా. రెగ్యులర్​గా వాటిని నా ఇన్​స్టా అకౌంట్​లో అప్​లోడ్ చేస్తుంటా. కవితలతోపాటు, పుస్తకాలు చదవడం, పాటలు పాడటం అంటే కూడా ఇష్టం. 
  •     నేను యాక్టర్​ కాకముందు, డైరెక్టర్​ ఒనిర్​ తీసిన రొమాంటిక్ డ్రామా ‘షాబ్’ మూవీకి అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేశా. 
  •     కొవిడ్​ టైంలో అందరూ ఇంట్లో కూర్చుంటే, నేను ‘బెల్​ బాటమ్’ షూటింగ్​కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే.. ఏ రంగమైనా, తమ పనిమీద దృష్టి, అంకిత భావం ఉండాలని.
  •      ప్రతి ఆడిషన్​ కాల్ నాకు ఒక అవకాశం లాంటిది. నేను అన్ని రకాల జానర్స్ చేయాలనుకుంటున్నా. ఒక నటుడిగా నాకు అన్ని రకాల క్యారెక్టర్స్​లో చేయాలనే ఆశ ఉంది.