స్కూటీని ఢీ కొట్టడంతో భార్యాభర్తలు స్పాట్ డెడ్.. అంబులెన్స్ డ్రైవర్దే ఈ పాపం !

 స్కూటీని ఢీ కొట్టడంతో భార్యాభర్తలు స్పాట్ డెడ్.. అంబులెన్స్ డ్రైవర్దే ఈ పాపం !

బెంగళూరు: ప్రాణాలు కాపాడే అంబులెన్సే ఇద్దరి ప్రాణాలు తీసింది. అంబులెన్స్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ పట్టించుకోకుండా దూసుకెళ్లడం వల్ల రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బెంగళూరు నగరంలోని రిచ్‌మండ్ సర్కిల్ దగ్గర ఈ ఘటన జరిగింది. రెడ్ సిగ్నల్ జంప్ చేసి వేగంగా వెళ్లిన అంబులెన్స్ వెనుక నుంచి వాహనాల పైకి దూసుకెళ్లింది. 

అంబులెన్స్ మూడు మోటార్ సైకిళ్లను ఢీ కొట్టింది. వాటిలో ఒకదాన్ని కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లి, పోలీసు అవుట్ పోస్ట్‌ను ఢీకొట్టాక అంబులెన్స్ ఆగిపోయింది. డియో స్కూటర్ నడుపుతున్న 40 ఏళ్ల ఇస్మాయిల్, అతని భార్య సమీన్ బాను ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అంబులెన్స్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. అరెస్టు చేసిన డ్రైవర్‌పై అశోక్‌ నగర్ పోలీసులు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా అంబులెన్స్ నడపడం వల్లే ఇద్దరు చనిపోయారని కేసు నమోదు చేశారు. 

ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన ఇది రెండవది కావడం గమనార్హం. అంబులెన్స్ డ్రైవర్లు కొందరు సైరన్‌లను దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఏ రోగినీ తీసుకెళ్లలేదు. అయినప్పటికీ, డ్రైవర్ సైరన్ ఆన్ చేసి వేగంగా నడుపుతున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం గమనార్హం.