- జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పరిశ్రమలు సాగాలి
- ప్రతి సంస్థకు ఒక పటిష్టమైన సేఫ్టీ ప్లాన్ ఉండాలి
- చిన్న నిర్లక్ష్యం ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని కామెంట్
- రవీంద్ర భారతిలో 55వ జాతీయ భద్రతా దినోత్సవానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: కార్మికుల ప్రాణ రక్షణ కోసం చేసే వ్యయం వృథా ఖర్చు కాదని, అది పరిశ్రమల ప్రగతికి వేసే అత్యుత్తమ పెట్టుబడి అని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా ‘జీరో యాక్సిడెంట్’ లక్ష్యంతోనే ముందుకు సాగాలని యాజమాన్యాలకు సూచించారు.
గతంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తే తమకు ఆర్థిక భారం పెరుగుతుందనే తప్పుడు ధోరణిలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉండేవని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని చెప్పారు. బోర్డు సభ్యులు సైతం రక్షణ అంశాలపై ప్రత్యేకంగా సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 55వ జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫ్యాక్టరీస్ డైరెక్టరేట్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్లక్ష్యం ఎంతటి భారీ మూల్యానికి దారితీస్తుందో చెప్పేందుకు సిగాచి ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న దుర్ఘటనను ఆయన ప్రస్తావించారు.
కేవలం రూ.20 లక్షలు ముందుగా వెచ్చించి ఉంటే ఆ ఫ్యాక్టరీలో అంతటి ఘోరమైన అగ్నిప్రమాదం జరిగి ఉండేది కాదని గుర్తుచేశారు. ప్రాథమిక దశలో చిన్నపాటి జాగ్రత్తలు గాలికి వదిలేసిన సదరు యాజమాన్యం, ఆ తర్వాత నష్టపరిహారం కింద ఏకంగా రూ.50 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. పారిశ్రామిక రంగంలో సాంకేతికత శరవేగంగా మారుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా యాజమాన్యాలు రక్షణ చర్యలను అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే శ్రమజీవులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ సంస్థకైనా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయన్నారు.
పారిశ్రామిక రంగానిది కీలక పాత్ర..
రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే బృహత్తర సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని, ఆ మహా లక్ష్యాన్ని చేరుకోవడంలో పారిశ్రామిక రంగానిదే అత్యంత కీలకమైన పాత్ర అని మంత్రి వివేక్ తెలిపారు. అందుకోసం నిరంతర ఉత్పత్తి జరగాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి మన కంపెనీలు ఎదగాలంటే పని ప్రదేశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయడంతోపాటు ప్రమాదరహిత వాతావరణం సృష్టించాలని తెలిపారు. ప్రతి సంస్థకు ఒక పటిష్టమైన సేఫ్టీ ప్లాన్ ఉండటమే కాకుండా, దానిని క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేసేలా పర్యవేక్షక వ్యవస్థ ఉండాలని సూచించారు.
కేవలం యజమానుల పైనే నెపం నెట్టకుండా, కార్మికులు కూడా నిబంధనలను తప్పకుండా పాటించినప్పుడే పూర్తి భద్రత సాధ్యమవుతుందని తెలిపారు. రక్షణ పరికరాల వినియోగం, అత్యవసర సమయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వర్కర్లకు నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో ఈ ‘సేఫ్టీ కల్చర్’ను మరింత బలోపేతం చేసే దిశగా శాఖాపరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ దిశగా వీలైనంత ఎక్కువగా చైతన్య కార్యక్రమాలు చేపట్టి కార్మిక లోకంలో భరోసాను నింపాలని ఫ్యాక్టరీస్ విభాగం సిబ్బందికి సూచించారు. పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ వ్యూహాలపై ఈ సదస్సులో విస్తృతమైన అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మోహన్‌బాబు తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని ‘ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రికి పరశురామ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. జెరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటోను ముద్రించకపోవడం అంటే రాజ్యాంగాన్ని విస్మరించడమేనన్నారు. కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు భైరపాక బెంజిమెన్, సుప్రదీప్, యాకన్న, బొల్లి స్వామి, మధు పాల్గొన్నారు.
