దవాఖానల్లో రూ. 80 ఖర్చుతో నాణ్యమైన భోజనం

దవాఖానల్లో రూ. 80 ఖర్చుతో నాణ్యమైన భోజనం
  • రోగులు, వారి సహాయకులకు మూడు పూటలా రూ.5కే అల్పాహారం, భోజనం
  • నార్సింగి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నిత్యం లక్ష మందికి భోజనాలు
  • ప్రభుత్వ పథకంలో హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యం సంతోషకరం

హైదరాబాద్:  సర్కార్ ఆస్పత్రుల్లో చేరిన పేషెంట్లకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఒక్కో భోజనానికి రూ.80 ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పేషెంట్ల వెంట వచ్చిన వారికి 3 పూటలా రూ. 5కే అల్పాహారం, భోజనం అందుబాటులో ఉంటుందని చెప్పారు. నార్సింగి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రోజూ లక్ష మందికి భోజనాలు అందిస్తున్నామని.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకంలో హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యం సంతోషకరమని మంత్రి హరీష్ రావు తెలిపారు. 
అంతకు ముందు నార్సింగిలో హరేకృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను రాష్ట్ర వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నగరంలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన రోగుల సహాయకులు, అలాగే ఔట్ పేషెంట్లకు తక్కువ ధరకే భోజనం అందించే సదుపాయం కోసం నార్సింగ్ లో ఈ వంటశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులకు రోజు పొద్దున పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం రూ. 5కే అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి  సెంట్రలైజ్డ్ కిచెన్లు మొత్తం నాలుగు ఏర్పాటు చేశామని.. నార్సింగి కిచెన్ ద్వారా ప్రతిరోజు లక్ష మందికి భోజనాలు సరఫరా చేయడం జరుగుతుందని హరీష్ రావు తెలిపారు.