
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ అంతఃపురంలో అలజడి మొదలైందని, నాలుగు స్తంభాలాట షురూ అయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సహకారంతో బీఆర్ఎస్ఎల్పీలో చీలికలు మొదలయ్యాయని ఆరోపించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. హరీశ్ రావు, కవితకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉన్నారని ఆరోపించారు. హరీశ్ రావును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని సీఎం చూస్తున్నారని పేర్కొన్నారు.
కేటీఆర్ పారిస్ పర్యటనలో ఉండగా, బీఆర్ఎస్ ఎల్పీ రెండుగా చీలబోతోందని వ్యాఖ్యానించారు. రజతోత్సవం మొత్తం కేసీఆర్, కేటీఆర్ నిర్వహించారని, కవిత, హరీశ్ రావు డమ్మీగా మారిపోయారన్నారు. పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. పదవులు, ఆస్తులు కేటీఆర్‌కే ఇస్తారా? అంటూ కవిత.. కేసీఆర్‌కు లేఖ రాశారని, ఆ లేఖను త్వరలో బయటపెట్టే అవకాశముందని తెలిపారు.
వైఎస్ జగన్‌పై షర్మిల ఏ విధంగా ఎదురు తిరిగిందో.. కేటీఆర్‌పై కూడా కవిత అలాగే ఎదురు తిరుగుతుందని బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేటీఆర్‌కు ఇస్తే బీఆర్ఎస్ ఎల్పీ తనకే ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేస్తున్నారని, అయితే పది మందిని తీసుకువస్తే బీఆర్ఎస్ ఎల్పీ తనకేనని రేవంత్ రెడ్డి.. హరీశ్ రావుకు హామీ ఇచ్చారని ఏలేటి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా హరీశ్, కౌన్సిల్ లీడర్‌గా కవితను చేయడానికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారని తెలిసి హరీశ్ రావును కేటీఆర్ బతిమిలాడుకున్నట్లు చెప్పారు.