
హైదరాబాద్ : స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీచర్లు పిలుపునిచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నిరసనలో పాల్గొంటున్న ఉపాధ్యాయుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ధర్నాకు వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు. టీచర్లతో ఉన్న చిన్నారులను సైతం పోలీస్ వ్యాన్లు ఎక్కించి స్టేషన్ కు తరలించారు.
ప్రభుత్వ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ముందే స్పౌజ్ టీచర్ల బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ లో ఉన్న 13 జిల్లాలపై నిషేధం ఎత్తేసి తక్షణమే ట్రాన్స్ ఫర్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
డీఎస్ఈ ముట్టడి కార్యక్రమానికి చాలా మంది టీచర్లు చిన్నారులతో హాజరయ్యారు. భర్త ఒక జిల్లాలో తాము ఒక జిల్లాలో పనిచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పిల్లల బాగోగులు సరిగా చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేయకండని కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి వెంట వచ్చిన ఓ చిన్నారి కేసీఆర్ తాత మా అమ్మానాన్నల్ని ఒకే జిల్లాకు పంపండంటూ చేతులు జోడించి ఏడుస్తూ వేడుకున్న తీరు అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.