H-1B వీసాదారుల జీవితభాగస్వాములకు వర్క్ పర్మిట్లు

H-1B వీసాదారుల జీవితభాగస్వాములకు వర్క్ పర్మిట్లు

అమెరికాకు విదేశీయుల వలసలను అరికట్టేందుకు గతంలో ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పూర్తిస్థాయిలో సమీక్షిస్తూ… అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. H-4 డిపెండెంట్ వీసాలను నిలిపివేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై… బైడెన్ సర్కారు  దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై H-1B వీసాదారుల జీవితభాగస్వాములకు కూడా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి బైడెన్ ప్రభుత్వం బిల్లు కూడా విడుదల చేసింది.

అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు అవసరమయ్యే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న H-1B వీసాదారులు, ఆరేళ్ల పరిమితిపై పొడిగింపు పొందినవారి భాగస్వాములు (H-4 వీసాదారులు) ఇకపై అమెరికాలో ఉద్యోగ అనుమతి పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆ బిల్లు వెసులుబాటు కల్పిస్తోంది. ఉద్యోగం కోసం మాత్రమే కాదు, వారు స్వయం ఉపాధి పొందేందుకు కూడా వీలు కలుగుతుంది. అంతేకాదు వారికి సామాజిక భద్రత, బ్యాంకు ఖాతాలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు సాధ్యపడుతుంది.