యాదగిరిగుట్ట, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం మొదలు కానున్నాయి. ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు యాదగిరిగుట్టలో, 27న ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
శనివారం ఈవో భవానీ శంకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదగిరిగుట్ట, పాతగుట్టతో పాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో 26న తిరువేంకటపతి అలంకార సేవ, 27న కాళీయమర్దన అలంకార సేవ, 28న గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, 29న శ్రీరామావతార అలంకార సేవ, 30న నృసింహ అలంకార సేవ, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
జయంతి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్ష్మీనరసింహస్వామి హవనం(హోమం), 26న చేపట్టే లక్ష కుంకుమార్చన, 27న చేపట్టే లక్ష పుష్పార్చనలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను ఆలయ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
లక్ష్మీనరసింహస్వామి హవన పూజకు రూ.2 వేలు, లక్ష కుంకుమార్చనకు రూ.2 వేలు, లక్ష పుష్పార్చనకు రూ.2 వేలుగా టికెట్ ధరను నిర్ణయించారు. ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

