Asia Cup 2025: డూ ఆర్ డై మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. సూపర్-4కు శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్

Asia Cup 2025:  డూ ఆర్ డై మ్యాచ్‌లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. సూపర్-4కు శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్

ఆసియా కప్ లో శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గురువారం (సెప్టెంబర్ 18) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ కుశాల్ మెండీస్ (74) బాధ్యతాయుత హాఫ్ సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి లంక జట్టుకు విజయాన్ని అందించాడు. శ్రీలంక విజయం సాధించడంతో గ్రూప్-బి లో బంగ్లాదేశ్ కూడా సూపర్-4 కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి గెలిచింది.   

కుశాల్ మెండీస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్: 

170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ ను తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆరంభించిది. తొలి ఓవర్లో 9.. రెండో ఓవర్లో 13 పరుగులు రావడంతో లంక జట్టుకు సూపర్ స్టార్ వచ్చింది. అయితే మూడో ఓవర్లో సూపర్ ఫామ్ లో ఉన్న నిస్సంకను ఓమర్జాయ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బంది పడిన మిశ్రా 10 బంతుల్లో కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఒక ఎండ్ లో కుశాల్ మెండీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో లంక జట్టు పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మెండీస్ కు కుశాల్ పెరీరా తోడవ్వడంతో లంక ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 45 పరుగులు జోడించి పరిస్తినిని చక్కదిద్దారు. 

20 బంతుల్లో 28 పరుగులు చేసిన పెరీరాను ముజీబ్ అద్భుతమైన బంతితో ఔట్ చేయడంతో లంక మూడో వికెట్ కోల్పోయింది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కుశాల్ మెండీస్ జాగ్రత్తగా ఆడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అసలంక (17), కామిందు మెండీస్ లతో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. కామిందు మెండీస్, కుశాల్ మెండీస్ ఐదో వికెట్ కు అజేయంగా  52 పరుగులు జోడించి లంక జట్టుకు విజయాన్ని అందించారు.  

నబీ విధ్వంసం:

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్  నబీ (22 బంతుల్లో 60: 6 సిక్సర్లు,3 ఫోర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగుల మాత్రమే చేయగలిగింది. సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార నాలుగు వికెట్లు పడగొట్టాడు. చమీర, వెళ్లలాగే, శనకలకు ఒక్కో వికెట్ దక్కింది. 

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తమ నిర్ణయానికి తగ్గట్టే ఆఫ్ఘనిస్తాన్ కు ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి రెండు ఓవర్లలోనే 26 పరుగులు రాబట్టి శరవేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మూడో ఓవర్లో లంక పేసర్ తుషార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో గర్భాజ్ (14), కరీం జనత్ (1)లను పెవిలియన్ కు చేర్చాడు. ఇదే ఊపులో తుషార మంచి టచ్ లో కనిపించిన తుషారను ఔట్ చేసి ఆఫ్ఘనిస్థాన్ ను కష్టాల్లో పడేశాడు. 

పవర్ ప్లే లో 45 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చాల స్లో గా సాగింది. ఇబ్రహీం జద్రాన్, రసూలీ స్లో గా ఆడడంతో తొలి 10 ఓవర్లలో 63 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్ లో ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన రసూలీ 16 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మిడిల్ ఓవర్స్ లో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. తొలి 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి లో తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఆల్ రౌండర్ నబీ ఈ దశలో అద్భుతమే చేశాడు. 

చివరి రెండు ఓవర్లలో ఏకంగా 49 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. నబీ 22 బంతుల్లోనే 6 సిక్సర్లు.. మూడు ఫోర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు. తొలి 10 ఓవర్లలో 63 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ చివర్ల 10 ఓవర్లలో 106 పరుగులు రాబట్టింది.