ముస్లింలకు ఇఫ్తార్‌‌, సహర్‌‌ అందిస్తున్న వైష్ణో దేవి ఆలయం

ముస్లింలకు ఇఫ్తార్‌‌, సహర్‌‌ అందిస్తున్న వైష్ణో దేవి ఆలయం
  • క్వారంటైన్‌లో ఉన్న వారికి స్పెషల్‌గా తయారీ
  •  రోజుకు 500 మంది ముస్లింలకు ఫుడ్

కత్రా: శ్రీ మాతా వైష్ణో దేవీ ఆలయ బోర్డు మత సామరస్యాన్ని చాటుతోంది. క్వారంటైన్‌లో ఉన్న 500 మంది ముస్లింలకు స్పెషల్‌గా ఇఫ్తార్‌‌, సహర్‌‌ను అందిస్తోంది. పవిత్ర రంజాన్‌మాసం సందర్భంగా ముస్లింలంతా రోజా ఉంటున్నందున వారి కోసం స్పెషల్‌గా ఫుడ్‌ తయారు చేసి అందిస్తున్నామని బోర్డు అధికారులు చెప్పారు. రంజాన్‌ మాసం కారణంగా స్టాఫ్‌ రాత్రి వేళ పనిచేస్తున్నారని, ముస్లింలకు ఇఫ్తార్‌‌, సహరా అందిస్తున్నారని వైష్ణో దేవి ఆలయ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌‌ రమేశ్‌ కుమార్‌‌ అన్నారు. “ ఆశిర్వాద్‌ భవన్‌లో క్వారంటైన్‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వెనక్కు తీసుకొస్తున్న ప్రభుత్వం వారిని క్వారంటైన్‌లో ఉంచింది. క్వారంటైన్‌లో ఉన్న వారిలో 500 మంది ముస్లింలు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా పొద్దున, సాయంత్రం వంట చేస్తున్నాం” అని రమేశ్‌ చెప్పారు. ఆశిర్వాద్‌ భవన్‌లోనే కాకుండా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లకు బోర్డు తరఫున ఫుడ్‌ అందిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటి వరకు 1.5 కోట్లు ఖర్చు

జమ్మూకాశ్మీర్‌‌లో ఉన్న 20 క్వారంటైన్‌ సెంటర్లకు రోజు ఫుడ్‌ అందించేందుకు ఇప్పటి వరకు రూ.1.5 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఫుడ్‌ తయారు చేస్తున్నామని చెప్పారు. మన దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధిక ఆదాయం వచ్చేది వైష్ణో మాత ఆలయానికే.