కేజ్రీవాల్ ప్రతిష్టకు కాల పరీక్ష

కేజ్రీవాల్ ప్రతిష్టకు కాల పరీక్ష

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత  కేజ్రీవాల్ ఇటీవల తన భవిష్యత్తును ప్రకటించారు.  సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే 2024 జూన్‌‌‌‌‌‌‌‌లో తాను జైలు నుంచి బయటకు వస్తానని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ లోక్​సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే తను జైల్లోనే  కొనసాగుతానని కేజ్రీవాల్ తెలిపారు. ఇది కేజ్రీవాల్ వాస్తవిక అంచనా. మొన్నటివరకు  కేజ్రీవాల్‌‌‌‌ గొప్ప గౌరవమన్ననలు పొందారు. 

2019లో  జరిగిన లోక్​సభ ఎన్నికల్లో  కేజ్రీవాల్ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసి 2 లక్షల ఓట్లు సాధించారు. కేజ్రీవాల్ ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​)కి 2023 ఏప్రిల్‌‌‌‌లో ఎన్నికల సంఘం నుంచి ప్రతిష్టాత్మక జాతీయ పార్టీ హోదా లభించింది. ఎందుకంటే ఆప్ భారతదేశంలో శరవేగంగా వ్యాపించింది. కానీ, ఇటీవల రాజకీయ సంఘటనలు వల్ల కేజ్రీవాల్‌‌‌‌ ప్రతిష్టపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన వన్​ మ్యాన్​ పార్టీ నెమ్మదిగా క్షీణించిపోతుందా, ఆప్​ తన ప్రాభవాన్ని కోల్పోతుందా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

అన్నా హజారేకు కేజ్రీవాల్​ మద్దతు

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి కేజ్రీవాల్ నాయకత్వం వహించారు.  అనంతరం నవంబర్, 2012లో ఆమ్​ ఆద్మీ పార్టీని  అరవింద్​ కేజ్రీవాల్​ స్థాపించారు. ఈ క్రమంలో డిసెంబర్, 2013లో  కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2013 నుంచి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ మూడుసార్లు గెలిచారు. 

కేజ్రీవాల్ భారత రాజకీయ తెరపైకి తుపానులా దూసుకువచ్చి కొత్త తరహా రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ వంటి శక్తిమంతమైన రాజకీయ యంత్రాంగాలను సామాన్యుడు తరిమికొట్టగలడని కేజ్రీవాల్ భారతదేశానికి చూపించారు. విచిత్రమేమిటంటే, కేజ్రీవాల్ ఢిల్లీలో మూడుసార్లు గెలిచినా, ఢిల్లీ నుంచి ఒక్క లోక్‌‌‌‌సభ ఎంపీని కూడా గెలిపించలేకపోయారు. ఆయన మంచి ముఖ్యమంత్రి అని ప్రజలు భావించారు. 

కానీ,  ప్రజలు మోదీనే ప్రధానిగా కోరుకున్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌‌‌‌ను పూర్తిగా తరిమికొట్టిన కేజ్రీవాల్ పంజాబ్‌‌‌‌లోనూ కాంగ్రెస్‌‌‌‌ను ఓడించారు. అయినప్పటికీ, కేజ్రీవాల్‌‌‌‌పై బీజేపీ వ్యూహాత్మకంగా దాడి చేయడంతో,  అది బీజేపీ బద్ధ శత్రువులను ఏకతాటిపైకి తెచ్చింది. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్,  కేజ్రీవాల్, మిత్రపక్షాలు ఏకమయ్యాయి.     కేజ్రీవాల్ స్వతహాగా తెలివైనవాడు, రాజకీయ చతురుడు, దేశవ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ, విచిత్రంగా కేజ్రీవాల్  తెలుగు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో కలిసి లిక్కర్​ స్కామ్​లో చిక్కుకున్నారు. ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’లో జైలు పాలయ్యారు.

లిక్కర్​ స్కామ్​తో అవినీతి మరకలు

 కొంతమంది తెలుగు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్యం పాలసీని మార్చినట్లయితే, వారు అతని పార్టీకి భారీ మొత్తంలో డబ్బు ఇవ్వనున్నామని చెప్పినట్లు ఆరోపణలు. ఇది విధాన మార్పు అని, తమను ఎవరూ అడ్డుకోలేరని  కేజ్రీవాల్​కు ఆ నేతలు వివరించారు. భారతదేశంలో ఎక్కడైనా వారు కోరుకున్నవారికి భారీగా డబ్బు చెల్లిస్తామని తెలిపారు.  ఆప్​ నాయకులకు  ప్రత్యక్షంగా డబ్బు కనిపించదు, నేరం కూడా ప్రత్యక్షంగా జరగదు కాబట్టి ఇది  డ్రీమ్ డీల్ లా అనిపించింది. 

మద్యం పాలసీని మార్చడంతో  డబ్బు అందుకున్నట్లు లిక్కర్​ స్కామ్​లో ఆరోపణలు వెలువడ్డాయి. అయితే,  కొంతమంది అసంతృప్త మద్యం వ్యాపారులు లిక్కర్ స్కామ్​ను బహిర్గతం చేశారు. దీంతో మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌‌‌‌తో సహా చాలామంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్లారు. ఎన్నికలు ఉన్నందున 2024 జూన్ 1 వరకు కేజ్రీవాల్‌‌‌‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేజ్రీవాల్ నేరస్థుడో కాదో  తెలియకపోయినా లిక్కర్ స్కామ్ ఆయన ప్రతిష్టను దిగజార్చింది. కేజ్రీవాల్ తన జాతీయ ఆశయాలను వదులుకున్నారు. థామస్ కెమోయిస్ రాసిన 500 సంవత్సరాల పురాతన జర్మన్ సామెత ‘మ్యాన్​ ప్రపోజ్​స్.. గాడ్​ డిస్పోజ్​స్’ గురించి కేజ్రీవాల్ ఆలోచిస్తూ ఉండాలి. లిక్కర్ స్కామ్ ప్లాన్లన్నీ విఫలమై కేజ్రీవాల్‌‌‌‌ను జైలులో పెట్టాయి. 

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేజ్రీవాల్ 

కేజ్రీవాల్ బెయిల్‌‌‌‌పై బయటకు వచ్చి కాంగ్రెస్‌‌‌‌తో  పొత్తు పెట్టుకుని పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత సానుభూతి కూడా ఉండవచ్చు. అయితే  కేజ్రీవాల్​ దోషిగా తేలితే కోర్టులు ఆయనను  విడిచిపెట్టవు అనేది వాస్తవం.  లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినాసరే లాలూ జైలుకు వెళ్లాడు. అంతేకాకుండా,  కేజ్రీవాల్ 14 సంవత్సరాలుగా సీఎం పదవిలో కొనసాగుతున్నారు. దీంతో  సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది.

కేజ్రీవాల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం

2024 పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ గెలిస్తే,  కేజ్రీవాల్‌‌‌‌కు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీబీఐ, ఈడీ, మనీలాండరింగ్ విచారణ, అవినీతి కేసులు తీవ్రంగా కొనసాగుతాయి. అయితే, ఒకవేళ బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో  ఓడిపోతే  కేజ్రీవాల్‌‌‌‌కి గొప్ప ఉపశమనం లభిస్తుంది. లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్‌‌‌‌ను దెబ్బతీసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ మరో రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రజలు లాలూ ప్రసాద్ యాదవ్‌‌‌‌కు ఓటు వేసినట్లే ఆయనకు ఓటు వేయవచ్చు. 

కానీ, వాస్తవానికి  మేధో వర్గం మద్దతు కనుమరుగైంది. కాంగ్రెస్‌‌‌‌తో  పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఎమ్మెల్యే సీట్లను కేజ్రీవాల్ పంచుకోవాల్సి వస్తుంది. ఇది కేజ్రీవాల్‌‌‌‌ను, ఆయన పార్టీని బలహీనపరుస్తుంది. ఆప్​ గత వైభవం క్రమేణా క్షీణిస్తుంది. ఖచ్చితంగా, కేజ్రీవాల్ జీవితంలో ఎప్పుడూ ఊహించని సమస్యలను,  జైలు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 

ఆయనను  అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టాయి. 600 సంవత్సరాల క్రితం షేక్​స్పియర్  ‘కష్టాలు వచ్చినప్పుడు ఒంటరిగా రావు.  ఇబ్బడి ముబ్బడిగా, మూకుమ్మడిగా వస్తాయి’ అని రాసిన కొటేషన్​ నాకు గుర్తుచేస్తుంది.  కేజ్రీవాల్ ప్రస్తుతం అనేక సమస్యలను ఒకేసారి ఎదుర్కొంటున్నారు. లిక్కర్​ స్కామ్​కు సంబంధించి.. తెలుగు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో చేతులు కలిపినందుకు ఖచ్చితంగా కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేసుంటారు. నేరాలకు సాక్షులు, ఆధారాలు ఉండవని  కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అయితే అన్ని నేరాలకు సాక్ష్యాలు ఉంటాయి. కొన్నిసార్లు సాక్షులు బయటకు వస్తారు.

 కేజ్రీవాల్ తాజా వివాదం..ఎంపీ స్వాతి మాలివాల్‌‌‌‌పై దాడి

 ఇటీవల ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ సీఎం కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి, కేజ్రీవాల్ సమక్షంలో తనను కొట్టారని చెబుతూ పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవద్దని కొందరు ఆప్ నేతలు ఆమెను  వేడుకు న్నారు. రాతపూర్వక ఫిర్యాదు చేస్తే కేజ్రీవాల్ బెయిల్ రద్దు అవుతుంది.  

కేజ్రీవాల్‌‌‌‌ తరఫున వాదిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదికి స్థానం కల్పించేందుకు స్వాతి మాలివాల్​ను రాజ్యసభ సభ్యత్వానికి బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఇది భారత రాజకీయాల్లో కనీ వినీ ఎరుగని రాజకీ యం. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా కనిపిస్తున్నా నిజానికి ఆయన చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు.  కేజ్రీవాల్ చాలా ఆందోళనలో ఉన్నారు.  ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అత్యంత జాగ్రత్తగా వ్యవహ రించాలి. జూన్ 4న  వెలువడే లోక్​సభ ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్ జైలులో ఉంటారో లేదా బయట ఉంటారో తెలుపుతాయి. 


-పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్