సీఏఏ కింద 14 మందికి ఇండియన్​ సిటిజన్ షిప్

సీఏఏ కింద 14 మందికి ఇండియన్​ సిటిజన్ షిప్

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) 2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లో హింసకు గురై మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో బుధవారం తొలిసారి14 మందికి భారత పౌరసత్వం సర్టిఫికెట్ అందజేసింది.

సీఏఏ చట్టం కింద ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి తొలివిడతగా14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి  అజయ్ కుమార్ భల్లా సిటిజన్ షిప్ సర్టిఫికెట్లను అందజేశారు. కాగా.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లో వేధింపులకు గురై భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ప్రక్రియను కేంద్రం 2019లో చేపట్టింది.

దీని కోసమే పౌరసత్వ చట్టాన్ని సవరించింది. 2014 డిసెంబర్ 31కి ముందు దేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్రం పేర్కొంది. అలాగే, అర్హత వ్యవధిని 11 నుంచి 5 ఏండ్లకు తగ్గించింది.