భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామాత్మక వరుణయాగం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఈ యాగం చేపట్టారు. ఎల్నినో కారణంగా ప్రస్తుతం వర్షాభావంతో కరవు పరిస్థితుల ఏర్పడిన నేపథ్యంలో దైవానుగ్రహంతో వర్షాలు కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం వేదపండితులు, అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య యాగం జరిపించారు. అంతకుముందు తొలి ఏకాదశి వేళ యాగశాల ప్రాంగణంలో సీతారాములకు పంచామృతాలతో అభిషేకం, గర్భగుడిలో బంగారు తులసీదళాలతో అర్చన నిర్వహించారు. రామాలయం ప్రాంగణంలో ఉత్తర, దక్షిణ ద్వారాల వైపు అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల కారణంగా తూర్పు, పడమర మెట్ల వైపు నుంచి భక్తులను దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలుకావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. స్వామికి నిత్య కల్యాణం, దర్బారు సేవలు జరిగాయి.
