
హైదరాబాద్: శ్రీ సత్యసాయి నేషనల్ క్రికెట్ లీగ్ సౌత్ జోన్ ఫైనల్స్ రేపటి నుంచి జరగనున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సౌత్, కర్ణాటక నార్త్, తమిళనాడు సౌత్, తమిళనాడు నార్త్ , కేరళ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఐక్యత, క్రీడా స్ఫూర్తి, సేవను దృష్టిలో పెట్టుకుని జులై 2024లో ప్రశాంతి నిలయంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు గుర్తుగా దేశ వ్యాప్తంగా ఈ టీ20 క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నారు.
గ్రామం, జిల్లా, రాష్ట్రం, జోనల్ లెవెల్ స్థాయిలో దేశ వ్యాప్తంగా 850 జట్లు పాల్గొన్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆరు నగరాల్లో జోనల్ లెవెల్ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ జోన్ ఫైనల్స్‌ను తుర్కయాంజాల్‌లోని జేబీ గ్రౌండ్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు ఏర్పాటు చేశారు.
జోనల్ లెవెల్‌లో నెగ్గిన జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి 17 వరకు పుట్టపర్తిలో ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే సౌత్ జోన్ ఫైనల్స్ ఓపెనింగ్ సెర్మనీలో హైదరాబాద్ మాజీ కమిషనర్, తెలంగాణ మైనార్టీస్ వెల్ఫేర్ సలహాదారు ఏకే ఖాన్, మాజీ టెస్టు క్రికెటర్ జ్యోతి ప్రసాద్, మాజీ రంజీ ప్లేయర్ సాయిబాబా, హెచ్‌సీఏ మెంబర్ ఆగమ్ రావు, సౌత్ జోన్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ముకుందన్ పాల్గొననున్నారు. ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమానికి మాజీ డీజీపీ హెచ్.జే దొర, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కే ప్రసాద్, ఇంటర్నేషనల్ అంపైర్ వీకే రామస్వామి, ఇతర రంజీ ప్లేయర్లు హాజరుకానున్నారు.