- మెట్రో విస్తరణ వద్దంటరు..
- బుల్లెట్ ట్రైన్ ఎందుకంటరు
- కాలుష్యాన్ని తగ్గించేందుకు
- ఇండస్ట్రీలను తరలిస్తామంటే తప్పంటరు
- తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేయడమే బీఆర్ఎస్ నేతల ఎజెండాగా కనిపిస్తున్నదని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: ప్రజల ఎజెండాను పట్టించుకోకుండా, తమ సొంత ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం భావితరాల భవిష్యత్తును నాశనం చేయడమేనని అన్నారు. శనివారం సీఎల్పీలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మెట్రో విస్తరణ వద్దంటరు.. బుల్లెట్ ట్రెయిన్ తీసుకొస్తామంటే ఎందుకంటరు..హైదరాబాద్ సిటీని ఫ్రీ పొల్యూషన్ చేయడం కోసం ఇండస్ట్రీలను దూరంగా తరలిస్తామంటే తప్పంటరు.. ఇదేం పద్ధతి? ఇదేం రాజకీయం? మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే చేశామా?” అని బీఆర్ఎస్ నేతలను శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
తెలంగాణకు పెట్టుబడులు వస్తే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందేమోనని ఓర్వలేక రాక్షసుల్లా అడ్డుపడుతున్నారన్నారు. తప్పుడు ప్రచారంతో తమను బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ఇప్పటికే తమ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దానికోసం సేకరించిన భూముల్లో లైఫ్ సైన్సెస్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలుష్యం లేకుండా ఫార్మా సంస్థలను ఏర్పాటు చేస్తామని, గ్రీన్ ఫార్మాకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా మారబోతున్నదని అన్నారు. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీశ్‌రావుకు, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ‘‘ఫ్యూచర్ సిటీపై హరీశ్, కేటీఆర్ చేస్తున్న కుట్రలను సహించేది లేదు.
మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనం మారకపోతే రేపు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు, చెన్నైలాంటి నగరాలు మనకంటే ముందుకు దూసుకుపోతుంటే , మనం ఇంకా పాత కాలంలోనే ఉండిపోదామా? ’’ అని ప్రశ్నించారు. 1990 లో కంప్యూటర్లు వస్తే..ఇప్పుడు ఏఐ యుగం నడుస్తున్నదని, ఆనాడు హైటెక్ సిటీ ఎలాగో.. రేపటి తరం కోసం భారత్ ఫ్యూచర్ సిటీ అలాగే అని పేర్కొన్నారు.
అలా చేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది?
రాజకీయం కోసం ఒక అంతర్జాతీయ ప్రాజెక్టును రద్దు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రాజెక్టులను రద్దు చేసుకుంటూ పోతే అసలు అభివృద్ధి అనేది జరుగుతుందా? అని అడిగారు. హరీశ్‌రావు చేసిన స్టేట్‌మెంట్‌తో అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్ దెబ్బతింటుందన్నారు.
ఇది తెలంగాణకు బీఆర్ఎస్ చేస్తున్న ద్రోహం కాదా? అని ఫైర్ అయ్యారు. చీప్, డైవర్షన్, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పినా.. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులు మొదలైనప్పుడు.. అప్ప టి ప్రతిపక్షాలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ దందాలు, స్కామ్‌లు అని విమర్శించాయని, మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వాటిని రద్దు చేసిందా? అని ప్రశ్నించారు.
‘‘చంద్రబాబు హైటెక్ సిటీని మొదలుపెడితే ..ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందా? చేయలేదు కదా? ఇంకో అడుగు ముందుకు వేసి మరింత అభివృద్ధి చేశాం.. అప్పుడు వేసిన పునాదుల వల్లే, ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్‌గా ఎదిగింది నిజం కాదా?’’ అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని, కానీ అభివృద్ధిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు. రాజకీయాలు తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం అనేది హరీశ్, బీఆర్ ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
