
హైదరాబాద్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మంగళవారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఎమ్మెల్సీ పోస్టులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్న ఈ టైంలో సీఎంను శంకరమ్మ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆమెకు ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శంకరమ్మకు ఎలాంటి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ అనేకసార్లు విమర్శించింది. ఈ క్రమంలో ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నది.