- ఆర్థిక వివాదాల కోణంలో దర్యాప్తు
- మూడు బృందాలతో పోలీసుల విచారణ
ఖమ్మం, వెలుగు: రచయిత, సాహితీవేత్త బొగ్గుల శ్రీనివాస్ మర్డర్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల 14న ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకెళ్లింది. కారును బయటకు తీయగా వెనుక సీటులో శ్రీనివాస్ మృతదేహం లభించింది. మొదట ఇది ప్రమాదమని భావించినా, కారు నడిపిన వ్యక్తి పరారవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అనంతరం పోలీసుల విచారణలో కారును ఉద్దేశపూర్వకంగానే నీటిలోకి నెట్టినట్టు తేలింది. మృతదేహంపై గాయాలు, పదునైన ఆయుధంతో దాడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఇది హత్యగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం నీటిలో మునిగే ముందు శ్రీనివాస్ మృతి చెందినట్టు స్పష్టమైంది.
ముందుగా ఆయనను ఎక్కడో హత్య చేసి, డెడ్‌బాడీని డంప్ చేసేందేకు పాలేరు వరకు తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.]
కారు యజమాని పనేనా?
కారు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఘటన జరిగిన రోజు నుంచి వేణుమాధవ్ రెడ్డి పరారీలో ఉండటం, ఫోన్ స్విచాఫ్ కావడంతో అతనిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాలర్ల వాంగ్మూలం ప్రకారం, కారు రిజర్వాయర్‌లోకి నెట్టిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయి, దుస్తులు మార్చుకుని సూర్యాపేట వైపు వెళ్లినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి ఘటనాస్థలం వరకు సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఆర్థిక వివాదాలే కారణమా?
కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శ్రీనివాస్ రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 2014లో ‘పవన్ కల్యాణ్ హటావో, పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకం రచించారు. తాజాగా వ్యాపార లావాదేవీలు, జీఎస్టీ లైసెన్స్ వినియోగంపై శ్రీనివాస్, వేణుమాధవ్ రెడ్డి మధ్య వివాదాలు ఉన్నట్టు సమాచారం. సుమారు రూ.60 లక్షల పన్ను బకాయిల నోటీసులు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరినట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
