
- నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు
- తెలంగాణ, ఏపీ మంత్రుల ప్రత్యేక పూజలు
- ఉప్పొంగిన భీమా నది.. వేల ఎకరాల్లో పంట మునక
- రోజూ 1,300 నుంచి 1,400 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి
- సమస్యల వేళ విద్యుత్ సంస్థలను ఆదుకుంటున్న కృష్ణా ప్రవాహం
మహబూబ్‍నగర్, నాగర్‌కర్నూల్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఎగువ నుంచి భారీ వరద నిలకడగా కొనసాగుతుండడంతో డ్యామ్ నిండుకుండలా మారింది. శుక్రవారం సాయంత్రం తెలంగాణ, ఏపీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అనిల్‌కుమార్ యాదవ్ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి నాలుగు గేట్ల ఎత్తి 1లక్ష 6 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మొదట ఆరో గేటు ఓపెన్ చేసి తరువాత వరుసగా 7,8,9 గేట్లను 10 అడుగులు వరకు ఎత్తి ఒక్కో గేటు ద్వారా 26వేలకు పైగా క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.3 అడుగులకు చేరింది. జలాశయం కెపాసిటీ 215 టీఎంసీలు కాగా నీటి నిల్వ190 టీఎంసీలకు చేరింది. గేట్ల ఓపెన్ ప్రోగ్రామ్‌లో నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు శాసనసభ్యులు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతలకు 2400 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా 42 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి ఏపీ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుస్తున్నారనే సమాచారంతో పర్యాటకులు పెద్ద ఎత్తున్న డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఘాట్ రోడ్డు పక్కగా వాహనాలు నిలుపుకుని గేట్ల నుంచి నీరు కిందికి జాలువారే దృశ్యాలను తిలకించారు. ప్రాజెక్టు గేట్లను తెరవ డానికి ముందు సైరన్ మోగిస్తూ దిగువన నది పరివాహక ప్రాంతాల్లోని జాలరులు, ఇతరులను అప్రమత్తం చేశారు. దిగువ ప్రాంతాల వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను రంగంలోకి దించారు.
జూరాలకు పోటెత్తుతున్న ప్రవాహం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా నదికి తోడు భీమా నది ఉప్పోంగడంతో శుక్రవారం సాయంత్రం ఈ రెండు నదుల సంగమం వద్ద ప్రవాహం 7.75 లక్షల క్యుసెక్కులకు చేరింది. ఈ నదులు కలయిక వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. పోటెత్తుతున్న ఈ భారీ ప్రవాహం శనివారం ఉదయం వరకు జూరాల చేరుకోనుంది. నారాయణపేట జిల్లా కృష్ణామండలంలో తీరం వెంట ఉన్న వేల ఎకరాల వరి నీట మునిగింది. నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్‍రావు రెవెన్యూ అధికారులతో కలిసి తీర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా వాసునగర్‍ను ఖాళీ చేయించారు. జురాల వరకు ఉన్న కురుమగడ్డ, నారదగడ్డ ఆలయాల్లోని పూజారులను, ప్రజలను కర్నాటక ప్రభుత్వం సురక్షింత ప్రాంతాలకు తరలించింది. 2009లో ఉప్పొంగిన కృష్ణమ్మ పదేళ్ల తర్వాత మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది.
శుక్రవారం సాయంత్రం నారాయణ్ పూర్ నుంచి 4.90లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. అదేవిధంగా భీమా నదికి 2.85 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. శుక్రవారం సాయంత్రం వరకు జూరాల ప్రాజెక్ట్‌కు 4.75 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 5.94 టీఎంసీలు ఉంది. డ్యామ్ నుంచి 39 గేట్లు ఎత్తి 4.91 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. కుడి కాలువకు750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు750 క్యూసెక్కులు, భీమా ఫేజ్-1 కాల్వకు1300 క్యూసెక్కులు, భీమా ఫేజ్-2 కాల్వకు750 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 750 క్యూసెక్కులు, నెట్టెంపాడు కాలువకు2250 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కాల్వకు315 క్యూసెక్కులు వదిలారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి గేట్లు, కాల్వల ద్వారా శ్రీశైలం డ్యామ్‌కు మొత్తం 4.98 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఈఈ శ్రీధర్ తెలిపారు. అలాగే భారీ వరద కారణంగా ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందన్నారు.
సాగర్‌కు పెరుగుతున్న వరద
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో నాలుగు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు 1.78 లక్షల క్యూసెక్కుల వదులుతున్నారు. దీంతో సాగర్ డ్యామ్‌కు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 517.20 అడుగులకు చేరుకుంది. డ్యామ్ కెపాసిటీ 312 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిల్వ 144.2194 టీఎంసీలు ఉంది. నాగార్జున సాగర్ నుంచి కుడికాల్వ తాగునీటి అవసరాలకు 4755 క్యూసెక్కులు, డీటీ గేట్ల ద్వారా మరో 10 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీకి నీరు విడుదల చేయడం లేదు. ఎగువన కృష్ణానదిలో ప్రవాహం భారీగా ఉండడంతో సాగర్‌కు వరద పెరిగే అవకాశం ఉందని, పంటలకు నీళ్లు వదిలే అవకాశాలు పెరుగతాయని ప్రాజెక్టు ఆఫీసర్లు చెబుతున్నారు.