Dharmendra: లెజెండరీ నటుడు గోప్యతకు భంగం.. ఫేక్ న్యూస్‌పై హేమ మాలిని, సన్నీ డియోల్ సీరియస్!

Dharmendra: లెజెండరీ నటుడు గోప్యతకు భంగం.. ఫేక్ న్యూస్‌పై హేమ మాలిని, సన్నీ డియోల్ సీరియస్!

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై ఇటీవల దేశవ్యాప్తంగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వయోభారం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స నిమిత్తం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.  చికిత్స అనంతరం బుధవారం ( నవంబర్ 12న ) ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు.

క్షమించరానిది... గోప్యతను గౌరవించండి..

అయితే ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు, పుకార్లు వ్యాపించాయి.  మంగళవారం ( నవంబర్ 11న ) కొన్ని మీడియా పోర్టర్లలో అయితే ఆయన మరణించారంటూ తప్పుడు వార్తలను ప్రసారం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వార్తతో అభిమానుల్లో ఒక్కసారి ఆందోళన నెలకొంది. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కథనాలపై ధర్మేంద్ర సతీమణి, నటి హేమ మాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  
  
"ఇది క్షమించరానిది..  చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత కలిగిన ఛానెల్స్ ఎలా తప్పుడు వార్తలను ప్రచారం చేయగలవు? అని హేమమాలిని ప్రశ్నించారు. ఇది అత్యంత అగౌరవంతో కూడుకున్నది, బాధ్యతారాహిత్యం. దయచేసి కుటుంబానికి, వారి గోప్యతకు తగిన గౌరవం ఇవ్వండి  అంటూ తన 'X' ఖాతా ద్వారా ఘాటుగా స్పందించారు. అటు ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ కూడా స్పందిస్తూ..  తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. 

సన్నీ డియోల్ ఆగ్రహం...

ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇంటి వద్దే ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో, ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉన్నప్పటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ధర్మేంద్ర మంచంపై ఉన్న దృశ్యాలు, ఆయన పక్కనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించడం అభిమానులను కలచివేసింది. అయితే, గురువారం ఉదయం, తన తండ్రి ఆరోగ్యంపై నిరంతరం వెంటాడుతున్న అసత్యాలపై సన్నీ డియోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి బయట గుమిగూడిన ఫొటోగ్రాఫర్లను ఉద్దేశించి చేతులు జోడించి.. మీరంతా ఇంటికి వెళ్ళండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ గోప్యతకు భంగం కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు.

►ALSO READ | Raju Weds Rambai Trailer: ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు.. ఆసక్తిగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ట్రైలర్

ఈ పరిస్థితులు చూస్తుంటే..  ధర్మేంద్ర కుటుంబం ఒకవైపు దిగ్గజ నటుడి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతూనే, మరోవైపు మీడియా నుంచి తప్పుడు ప్రచారం, అతిగా జోక్యం చేసుకోవడం వంటి వాటిని ఎదుర్కొవాల్సి వస్తోంది. అటు అభిమానులంతా 'హీ-మ్యాన్' ధర్మేంద్ర త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.