ప్రాజెక్టుల అప్పగింతపై తప్పుదోవ పట్టిస్తున్నరు : హరీశ్​రావు

ప్రాజెక్టుల అప్పగింతపై తప్పుదోవ పట్టిస్తున్నరు : హరీశ్​రావు
  • తాగునీటి కోసం కృష్ణా బోర్డు వైపు చూడాల్సిన దుస్థితి : హరీశ్​

హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో ఉందని, ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రాజెక్టులను అప్పగించే విషయంలో గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం పలుసార్లు ప్రస్తావించిన అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న కేంద్రానికి లేఖ రాసిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన కేఆర్ఎంబీ మీటింగ్​లో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు ప్రాజెక్టులను బోర్డు నిర్వహణకు అప్పగిస్తున్నట్టు మీడియా ముఖంగా ప్రకటించారని తెలిపారు.

మీటింగ్​లో తెలిపిన అంగీకారం ప్రామాణికమా, 27న రాసిన లేఖ ప్రామాణికమా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్  చేశారు. ‘‘కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారని నేను చెప్తే హరీశ్​రావు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్  నేతలు అన్నారు. కానీ, ఈరోజు ఏం జరిగింది? తాజా నిర్ణయంతో చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి. తాగునీటి కోసం బోర్డు వైపు చూడాల్సి ఉంటుంది. హైడ్రల్  పవర్  ప్రాజెక్టులపై చర్చ జరగలేదని చెప్తున్నారు. కానీ నీళ్లు లేకుండా కరెంట్ ​ఉత్పత్తి ఎలా చెస్తారో చెప్పాలి.

బోర్డు అనుమతి లేకుండా కరెంట్​ఉత్పత్తి సాధ్యమేనా? బోర్డు అనుమతుల్లేకుండా ప్రాజెక్టుపై ఇంజనీర్లు, అధికారులు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు” అని హరీశ్  పేర్కొన్నారు. కాగా, 2‌‌‌‌021లోనే కేంద్రం గెజిట్ ​జారీ చేసి ఒత్తిడి తెచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరీంచలేదని చెప్పారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఎవరో స్పష్టమవుతోందన్నారు.