శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.6 .14 కోట్లు

శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.6 .14 కోట్లు

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం మల్లన్నకు హుండీ ద్వారా రూ.6.14 కోట్ల ఆదాయం వచ్చింది. భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపును బుధవారం అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. మొత్తం రూ.6 కోట్ల 14 లక్షల 22 వేల 180 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. గత 28 రోజుల్లో కార్తీకమాసం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో కానుకలు సమర్పించారని ఆయన చెప్పారు.

నగదుతో పాటు 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 10 కిలోల 160 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని వెల్లడించారు. విదేశీ కరెన్సీలో 1118- అమెరికన్ డాలర్లు, 130 యూఏఈ దిర్హమ్ లు, 100 యూకే పౌండ్లు, 40 - ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగిట్స్, 20- కెనడా డాలర్లు, 19 సింగపూర్ డాలర్లు, 10 -యూరోలు ఉన్నాయని వివరించారు. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన  అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.