శ్రీశైలంలో వైభవంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

శ్రీశైలంలో వైభవంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

 శ్రీశైల మహాక్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఈ విశేష వేడుకను చేపట్టింది.

కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం అక్కమహాదేవి అలంకార మండపంలో సహస్ర కలశారాధన కన్నుల పండుగగా జరిగింది. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పం పఠించగా, గంగానది పుణ్యజలాలతో కలశాలను పూజించారు. అనంతరం సుమారు వెయ్యి మంది భక్తులు ఈ పుణ్య కలశాలను తలపై ధరించి.. శివనామ స్మరణతో క్షేత్ర వీధుల్లో కలశయాత్ర నిర్వహించారు. నందిగుడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు సాగిన ఈ శోభాయాత్ర భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. యాత్ర అనంతరం శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారికి శాస్త్రోక్తంగా కలశాభిషేకం జరిపించారు.

అనంతరం భక్తులచే 'శివ పంచాక్షరీ నామలేఖన యజ్ఞం' నిర్వహించబడింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తితో శివ పంచాక్షరీ మంత్రాన్ని లిఖించి, ఆ పుస్తకాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు.

సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వనపర్తి బృందం చే శివ భజనలు, రాజమహేంద్రవరానికి చెందిన తాతా సందీప్ శర్మ గారిచే 'ఓంకార ప్రాశస్త్యం'పై ప్రవచనం భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక విజయనగరానికి చెందిన సుప్రియ బృందం ప్రదర్శించిన 'పేరిణి శివతాండవం' ఈ వేడుకలకే హైలైట్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేవాలయాలే ధార్మిక చైతన్యానికి ఆలవాలమని, ధర్మాచరణ ద్వారానే పటిష్టమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమనాథ్ స్వాభిమాన స్పూర్తిని చాటుతూ జరిగిన ఈ కార్యక్రమం శ్రీశైల క్షేత్రంలో ఒక మధుర ఘట్టంగా నిలిచిపోయిందన్నారు.