SRSP స్టేజ్ -2కు దివంగత నేత RDR పేరు పెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

SRSP స్టేజ్ -2కు దివంగత నేత RDR పేరు పెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: SRSP స్టేజ్ -2కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం (అక్టోబర్ 12) తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్మరణ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ దామోదర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. 

“రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం అర్పించారు.

నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అలుపెరగని పోరాటం చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్ -2 ద్వారా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలు తరలించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 ప్రారంభమయ్యేలా పోరాటం చేశారు. అందువల్ల ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడం వారికిచ్చే నిజమైన నివాళి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.