
అలప్పుజ: కేరళలో సెకండరీ స్కూల్ పరీక్ష పాసైన వాళ్లలో చాలామంది విద్యార్థులకు చదవడం, రాయడం రావట్లేదని ఆ రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి సాజి చెరియాన్ అన్నారు. ఆదివారం అలప్పుజలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎస్ఎస్ఎల్సీ పాస్ కావడానికి కనీస మార్కులు (210) తెచ్చుకోవడం కూడా చాలా కష్టమయ్యేదని చెప్పారు. ఇప్పుడు 99 శాతానికి పైగా విద్యార్థులు పాస్ అవుతున్నారని చెప్పారు.
వారిలో చాలామందికి సరిగా రాయడం, చదవడమే రావట్లేదన్నారు. విద్యార్థులు ఫెయిల్ అయితే, విద్యాశాఖ వైఫల్యమని ముద్ర పడుతుందని చెప్పారు. అందుకే పేపర్ దిద్దే విషయంలో ఉదారంగా ఉండడమే మేలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీంతో ఎస్ఎస్ఎల్సీ పాస్ పర్సెంటేజ్ పెరిగిందన్నారు. ఈ సంప్రదాయం మంచిది కాదని విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టి అన్నారు. ఈ విధానంలో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారన్నారు. కాగా.. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు బాగున్నాయని కేరళ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న వేళ మత్స్య శాఖ మంత్రి చెరియాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.