
హైదరాబాద్ వెలుగు : ఎంపీ, ఎమ్మెల్యేలు లక్షల్లో జీతాలు తీసుకుంటూ తమకు ఐదారు వేలు మాత్రమే ఇస్తున్నారని, కుటుంబాలతో ఎట్ల బతకాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ హాస్టళ్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వలంటూ శనివారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేశారు. మోడల్‌స్కూల్ హాస్టల్ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్మాట్లాడుతూ హాస్టల్స్ సిబ్బందికి నెలలుగా జీతాలు సరిగా ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నం. 60 ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ హాస్టల్స్‌లోని సిబ్బందికి ఇస్తున్నట్లు తమకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. జిల్లాల్లో బకాయిలను వెంటనే చెల్లించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో వివిధ జిల్లాల నుంచి హాస్టల్స్ సిబ్బంది భారీగా తరలివచ్చారు.