
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లు, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఎగ్జామ్‌ను ఓఎంఆర్‌కు బదులు, కంప్యూటర్ బేస్డ్గా పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్‌లో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు మెడికల్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వగా, 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్వహించినట్టుగానే ఓఎంఆర్ బేస్డ్గా ఎగ్జామ్ పెట్టాలని తొలుత భావించారు. క్వశ్చన్ పేపర్ తయారీ బాధ్యతలను జేఎన్‌టీయూకు అప్పగించారు. అయి తే, టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ బాగోతం బయటపడడంతో, సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నిర్వహించారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును మంత్రి హరీశ్ రావు మంగళవారం ఆదేశించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాల వెల్లడిలో జాప్యంపై మంత్రి ఆరా తీశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతున్నదని బోర్డు అధికారులు మంత్రికి వివరించారు. ఈలోగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి డీఎంఈని ఆదేశించారు.
1,827 పోస్టుల భర్తీ ఎన్నికల తర్వాతే!
ప్రస్తుతం రిక్రూట్ చేస్తున్న 5,204 పోస్టులు కాకుండా, మరో 1,827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఇటీ వలే ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నోటిఫికేషన్‌లోనే వీటిని కూడా యాడ్ చేసేందుకు చాన్స్ ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్, ఇతర ప్రభుత్వ దవాఖాన్లలో నర్సింగ్ స్టాఫ్ కొరత ఉంది. కొత్తగా పర్మిషన్ వచ్చిన పోస్టుల ను కూడా ఇదే రిక్రూట్‌మెంట్‌లో కలిపేయాలని ప్రభుత్వానికి హెల్త్ ఆఫీసర్లు సూచించారు. కానీ, ఇందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేయలేదు. రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ల దశలోనే ఉంది. ఎగ్జామ్ డేట్, ఫలితాలు, పోస్టింగ్స్ ఇచ్చి రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే లోపల ఎన్నికలు వచ్చే చాన్స్ ఉంది. దీంతో ఇక ఎన్నికల తర్వాతే మిగిలిన పోస్టుల భర్తీ ఉండొచ్చునని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.