- 11 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల లక్ష్యం
- రైతు డిస్కమ్ ఏర్పాటులో భాగంగా ఆస్తుల విభజనపై కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న 'రైతు డిస్కమ్' ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వే ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5.60 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌లు) గణనను 11 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 744 సెక్షన్లలో మొత్తం 2,232 బృందాలను రంగంలోకి దించారు. రైతు డిస్కమ్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయి ఆస్తుల విభజనలో భాగంగా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వేను చేపట్టారు. ఒక్కో బృందం రోజుకు 25 ట్రాన్స్‌ఫార్మర్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 50 వేల డీటీఆర్‌లను సర్వే చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద రాజేంద్రనగర్ సర్కిల్‌లో వ్యవసాయ డీటీఆర్‌ల సర్వే పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.
సర్వే కోసం ప్రత్యేక యాప్...
సర్వే పారదర్శకంగా సాగేందుకు రైతు డిస్కమ్ అధికారులు ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. ప్రతి సెక్షన్‌లోని ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాన్స్‌ఫార్మర్ స్ట్రక్చర్, ఎంబోస్ నంబర్, నేమ్‌ప్లేట్ వివరాలను ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ప్రాంతం (లోకేషన్) కచ్చితంగా తెలిసేలా జియో కోఆర్డినేట్లను నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వే నిర్వహణపై బుధవారం మూడు డిస్కమ్‌ల సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి రైతు డిస్కమ్‌ను అధికారికంగా ప్రారంభించే అంశంపై చర్చించారు. రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మాట్లాడుతూ.. ఈ నెల 28న లైసెన్స్ మంజూరుపై విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) బహిరంగ విచారణ ఉంటుందని, ఆస్తుల మ్యాపింగ్ పూర్తయితే జూన్ 2 నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణ, ఉత్తర డిస్కమ్‌ల సీఎండీలు జితేష్ వి. పాటిల్, వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు డా. నరసింహులు, మోహన్ రావు, మధుసూదన్, శివాజీ, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, రైతు డిస్కమ్ చీఫ్ ఇంజినీర్లు ఏ. కామేష్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
