మార్చి 18న రాష్ట్ర బడ్జెట్​..

మార్చి 18న రాష్ట్ర బడ్జెట్​..
  • 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • రెండు వారాల పాటు సెషన్స్‌‌‌‌‌‌‌‌
  • సీఎంవో అధికారులతో చర్చించిన అసెంబ్లీ సెక్రటరీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి.  18న రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించి, అప్రాప్రియేషన్‌‌‌‌‌‌‌‌ బిల్లుతో ముగించేలా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తున్నారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల నిర్వహణపై మంగళవారం అసెంబ్లీలో సీఎంవో అధికారులతో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సమావేశమయ్యారు. రెండు వారాల పాటు సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌‌‌‌‌‌‌‌ నిబంధనలతో ఫిజికల్​ డిస్టెన్స్​ పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి నెలాఖరులోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌, ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల అనుమతి తప్పనిసరి. ఈ నెల రెండో వారం నుంచే సమావేశాలు నిర్వహించాలని అనుకున్నా ఈ నెల 14న గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ పోలింగ్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో ఆ మరుసటి రోజు నుంచి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో అసెంబ్లీ అధికారులు సమావేశాల నిర్వహణపై దృష్టి పెట్టారు. కనీసం 15 వర్కింగ్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌  ఉండేలా అసెంబ్లీని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించినట్టు  తెలుస్తోంది.

సమావేశాలు ఇట్లా..!

ఈ నెల 15న గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతారు.  ఇటీవల మృతిచెందిన నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు 16న సంతాపం తెలుపుతారు. 17న గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతారు. 18న ఉభయ సభల్లో 2021–  22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ప్రవేశ పెడుతారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ పద్దులపై సభ్యులు స్టడీ చేయడానికి 19న సెలవు ఇచ్చి, 20 నుంచి 28 వరకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ పద్దులపై చర్చిస్తారు. 28న లేదా 29న అప్రాప్రియేషన్‌‌‌‌‌‌‌‌ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత నిరవధికంగా వాయిదా వేస్తారు. నిరుడు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాలు నిర్వహించే సమయంలోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో సెషన్స్‌‌‌‌‌‌‌‌ మధ్యలోనే ముగించారు. గత సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 18 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయించినా కరోనా కారణంగా వారం రోజుల్లోనే ముగించారు. ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని  తీసుకువచ్చారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ చట్ట సవరణ సహా పలు ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌లకు ఆమోదం తెలుపడానికి అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 13, 14 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. కరోనా కారణంగా మీడియాను లాబీల్లోకి అనుమతించని అధికారులు ఇప్పుడు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లోనూ అదే నిబంధన పాటించనున్నట్టుగా చెప్తున్నారు.