జులై 2న కేబినెట్ భేటీ.. తొలిసారిగా డిజిటల్ విధానంలో మీటింగ్

జులై 2న కేబినెట్ భేటీ.. తొలిసారిగా డిజిటల్ విధానంలో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో ‘ఈ-కేబినెట్’ నిర్వహించనున్నారు.

ఈ భేటీలో మూసీ పునరుజ్జీవన ఫేజ్ పనులకు ఆమోదం తెలపడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిధుల కేటాయింపు నిబంధనలు వీబీ-జీ రామ్-జీ చట్టంపై చూపుతున్న ప్రభావంపై మంత్రివర్గం చర్చించనుంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా తెచ్చిన కొత్త నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో పాటు తెలంగాణ గ్రామీణ కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు కేంద్ర నిర్ణయం వల్ల నష్టపోతున్న ఇతర రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని సుప్రీంకోర్టులో ఉమ్మడిగా న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.

లేదా కోర్టుల వల్ల సమయం వృథా కాకుండా కేంద్ర నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంత బడ్జెట్‌తో ఒక ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని కూడా ప్రత్యామ్నాయంగా చూస్తున్నది. ఈ రెండు కీలక ప్రతిపాదనల్లో ఏ దారిని ఎంచుకుని కూలీలను కాపాడుకోవాలనే అంశంపైనే జూలై 2న జరిగే కేబినెట్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు.